కొనసాగుతున్న విచారణ
పార్వతీపురం/గరుగుబిల్లి : విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలంలోని రావివలస పీఏసీఎస్‌లో జరిగిన బినామీ రుణాల అవకతవకలపై రెండో రోజు బుధవారం పార్వతీపురం డివి జన్ కో ఆపరేటివ్ డిప్యూటీ రిజిస్ట్రారు పి.చిన్నయ్య నేతృత్వంలో అధికారుల బృందం విచారణ కొనసాగించింది. సహకార సంఘం చట్టం సెక్షన్ 51 ప్రకారం చేపట్టిన ‘రుణగ్రస్తుల విచారణ’కు 108 మంది హాజరయ్యారు. బినామీలుగా గుర్తించిన 480 మంది రైతులకు ఈ నెల 16 నుంచి 19 వరకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. ఇందులో భాగంగా బుధవారం 120 మందికి స మన్లు జారీ చేయగా, అందులో 108 మంది హాజరైనట్లు కమిటీ తెలిపింది.
ఈ రెండు రోజులు విచారణకు హాజ రు కాని వారికి తర్వాత సమయం ఇస్తామన్నారు. అయితే ఈ కమిటీ ముందు రెండు రోజులు హాజరైన 209 మంది కూడా తాము రుణం తీసుకోలేదని, తమకు పీఏసీఎస్ ముఖం కూడా తెలియదని చెప్పినట్లు సమాచారం. దీనిలో భాగంగా 11 కాలమ్స్‌కు సంబంధించి ప్రొఫార్మాలో సమాచారం సేకరించి తమచే సంతకాలు చేయించుకున్నట్లు బాధితులు తెలిపారు. ఇందులో అధి క మంది భూములు లేని వారమని తెలపగా, మిగతా వారు తమకు పీఏసీఎస్‌లో సభ్యత్వం లేదని, తాము రుణాలు అడగలేదని, తమకు రుణాలు అంటగట్టారని వాపోయినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఈ పీఏసీఎస్ పరిధిలో 11వేల మందికి పైగా రైతులుండగా, ఇందులో 4,485 మంది రైతులు రుణం తీసుకున్నట్లు రికార్డులు చూపిస్తున్నాయి.
దీంతో పాటు 2009నాటికి దీని వ్యాపా ర లావాదేవీలు సుమారు రూ.9కోట్లు కాగా, ప్రస్తుతం సుమారు రూ.18.20కోట్లకు పెరిగింది. ఇంకా గురు, శు క్రవారాల్లో చిలకాం, కారివలస, దత్తివలసలకు చెందిన వారికి విచారణ జరగనుందని బృందం నాయకులు పి.చిన్నయ్య తెలిపారు. ఈ విచారణ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామన్నారు. ఈ విచారణపై రైతులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని ఆయన చెప్పారు. విచారణను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.