పోర్టుకు భూసేకరణే కీలకం
524 ఎకరాలు మాత్రమే సేకరణ
ఇంకాసేకరించాల్సిన భూమి 4,800 ఎకరాలు
ప్రాంతాల వారీగా భూమి ధర నిర్ణయమే అడ్డంకి
మచిలీపట్నం : జిల్లా ప్రజల చిరకాల కోరిక బందరుపోర్టు అభివృద్ధికి భూసేకరణే కీలకంగా మారింది. 11 సంవత్సరాలుగా బందరు పోర్టు నిర్మించాలని ఉద్యమం జరుగుతోంది. ప్రజల కాంక్ష గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 2008 ఏప్రిల్ 23వ తేదీన పోర్టు పనులకు శంఖుస్థాపన చేశారు.
2009లో ఎన్నికలు రావడం, అనంతరం వైఎస్ మరణం తదితర ఆటంకాల నేపథ్యంలో పోర్టు పనులు అటకెక్కాయి. రాష్ట్ర విభజన అనంతరం పోర్టు అభివృద్ధి అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో బందరు పోర్టు అభివృద్ధి చేస్తామని ప్రస్తావించారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేబినెట్ సమావేశాల్లోనూ బందరుపోర్టును అభివృద్ధి చేయాలని పదే పదే చెబుతూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో బందరు పోర్టు పనులు ప్రారంభం కావడానికి కొంత మార్గం సుగమం అయ్యింది. అయితే వచ్చిన చిక్కంతా భూసేకరణే. పోర్టు అభివృద్ధికి 2012 మే నెలలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జారీ చేసిన జీవో నంబరు 11 ప్రకారం 5,282 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో 524 ఎకరాలు పోర్టుకు సంబంధించిన భూమి ఉంది. ఈ భూమి ఇప్పటికే సేకరించారు. మిగిలిన 4,758 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది.
భూమి ధరలో వ్యత్యాసం
బందరు పోర్టు మంగినపూడి, తపసిపూడి, గోపువానిపాలెం, కరగ్రహారం, చిలకలపూడి పంచాయతీల పరిధిలో ఏర్పాటు కానుంది. ఈ గ్రామాల పరిధిలోనే ప్రభుత్వ, పట్టా, అసైన్డ్ భూమిని సేకరించాల్సి ఉంది. అయితే ఒక్కొక్క గ్రామంలో ఎకరానికి ఇచ్చే నష్టపరిహారాన్ని ఎక్కువ, తక్కువలుగా నిర్ణయించడటంతో రైతులు భూమిని ఇచ్చేందుకు అంగీకరిస్తారా, లేదా అన్న అంశం చర్చనీయాంశమైంది. పక్క పక్కనే ఉన్న గ్రామాల పరిధిలోని భూములకు చెల్లించే నష్టపరిహారం విలువలో భారీ వ్యత్యాసం ఉండటంతో రైతులు ఎంత వరకు భూమిని వదులుకుంటారనే అంశం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో, పోర్టు నిర్మిస్తారనే ప్రచారం జరగడంతో మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. మంగినపూడి, గోపువానిపాలెం, తపసిపూడి గ్రామాల్లో మంగినపూడిబీచ్ రోడ్డు వెంబడి ఎకరం రూ. 50 లక్షల మార్కెట్ ధర పలుకుతోంది. రోడ్డుకు దూరంగా భూములు ఉంటే రూ. 25 నుంచి రూ. 30 లక్షలు ధర ఉంది. పోర్టు నిర్మాణ పనులు ప్రారంభమైతే ఈ ధర మరింత పెరుగుతుందనే కారణంతో రైతులు భూములను విక్రయించడం లేదు.
పోర్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యే సూచనలు ఉండటంతో రెవెన్యూ అధికారులు మంగినపూడి, తపసిపూడి, గోపువానిపాలెం, చిలకలపూడి తదితర ప్రాంతాల్లోని కొన్ని సర్వే నంబర్లలోని భూములు రిజిస్ట్రేషన్ కాకుండా బ్లాక్ లిస్ట్‌లో పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. మార్కెట్ ధరకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారానికి భారీ వ్యత్యాసం ఉండటంతో భూసేకరణ తలనొప్పిగా మారే అవకాశం ఉంది.
ఈ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు పోర్టు నిర్మాణాన్ని కోన, పల్లెతుమ్మలపాలెం, పోలాటితిప్ప వైపు మార్చే యోచన చేస్తున్నారనే ప్రచారం విసృ్తతంగా జరుగుతోంది. ఈ మూడు గ్రామాల పరిధిలో దాదాపు 17వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. వీటిలో ఏడు వేల ఎకరాలను భారత్‌సాల్ట్ కంపెనీకి ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. మిగిలిన 10వేల ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని పోర్టుకు కేటాయిస్తే త్వరితగతిన భూసేకరణ జరగడంతో పాటు రైతుల నుంచి అభ్యంతరాలు తక్కువగానే ఉండే అవకాశం ఉంది.