ఎర్రచందనం దుంగలు మాయం!
నంద్యాల టౌన్: ఇన్నాళ్లు అడవిని కొల్లగొట్టిన ఎర్రచందనం దొంగలు బరితెగించారు. ఏకంగా నేషనల్ హైవే, త్రీటౌన్ పోలీస్ స్టేషన్, ఏఎస్పీ ఆఫీసు సమీపంలో ఉన్న నంద్యాల డివిజనల్ ఫారెస్టు అధికారి కార్యాలయంలో చోరీకి పాల్పడ్డారు. అధికారుల సంరక్షణలో ఉన్న రూ.50 లక్షలు విలువ చేసే ఎర్రచందనం దుంగలను రాత్రికి రాత్రే ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన చోటు చేసుకొని నెల గడిచినా అటవీ శాఖ అధికారులు బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్త పడినట్లు సమాచారం.
విశ్వసనీయ వర్గాల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక బొమ్మలసత్రంలో అటవీ శాఖ కార్యాలయం ఉంది. పక్కనే ఆర్అండ్బీ శాఖ, నందిపైపుల ఫ్యాక్టరీ, త్రీటౌన్ పోలీస్ స్టేషన్, ఏఎస్పీ కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడ పూర్తి స్థాయి భద్రత ఉంటుంది. డివిజన్ పరిధిలో పట్టుబడిన ఎర్రచందనం దుంగలను డీఎఫ్ఓ కార్యాలయ ప్రాంగణంలో భద్రపరుస్తారు. కార్యాలయానికి కాపలా కూడా ఉంటుంది. అయితే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు సిబ్బంది కళ్లు కప్పి నెల క్రితం ఆర్డీఓ బంగ్లాకు వెళ్లే దారిలో లారీని నిలిపి రాత్రికి రాత్రే చడి చప్పుడు కాకుండా ఎర్రచందనం దుంగలను ఎక్కించి చోరీ చేసినట్లు సమాచారం.
మూడు టన్నులకు పైగా బరువు ఉన్న 80 ఎర్రచందనం దుంగలను అపహరించినట్లు తెలుస్తోంది. వీటి విలువ రూ.50 లక్షలు పైమాటే. పనిలో పనిగా దొంగలు నాణ్యతను పరిశీలించకుండా మరో 20 సండ్రా దుంగలను కూడా ఎత్తుకెళ్లారు. ఈ వ్యవహారం నాలుగైదు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. అయితే అటవీ శాఖ అధికారులు అసలు నిజం వెలుగులోకి రాకుండా చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
చోరీ జరగలేదు: డీఎఫ్ఓ కార్యాలయ ప్రాంగణంలో ఎలాంటి చోరీ జరగలేదని నంద్యాల డీఎఫ్ఓ శ్రీలక్ష్మి చెప్పారు. ఇక్కడ ఉన్న ఎర్రచందనం దుంగలను ఎప్పటికప్పుడు ప్రొద్దుటూరు డిపోకు తరలించామని ఆమె వివరించారు.