భద్రత కల్పించడమే ఎల్ఐసీ ధ్యేయం
నెల్లూరు డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ రమేష్‌బాబు
నెల్లూరు(బృందావనం) : దేశంలోని ప్రజల ధనానికి రక్షణ, భద్రత కల్పించడమే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ధ్యేయమని ఎల్ఐసీ నెల్లూరు డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ పి.రమేష్‌బాబు అన్నారు. సంస్థ 60వ వార్షికోత్సవాన్ని (వజ్రోత్సవ సంవత్సరం) పురస్కరించుకుని నెల్లూరులోని దర్గామిట్టలో ఉన్న నెల్లూరు డివిజనల్ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కేంద్రంగా ఉన్న నెల్లూరు డివిజన్ 2015–16సంవత్సరంలో 1,63,055 పాలసీలు కలిగి ఉందన్నారు. రూ.3,569 కోట్లు బీమామొత్తంతో, రూ.182కోట్లు మొదటి ప్రీమియం సాధించి కర్నాట, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 17 డివిజన్లలో రెండోదిగా సాగుతోందన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అనంతరం కార్యాలయంలో ఆయన ఎల్ఐసీ పతాకాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో మేనేజర్(సేల్స్) ఓ.కృష్ణమూర్తి పాల్గొన్నారు.