dlda office
-
అమీ.. తుమీ
సాక్షి, విశాఖపట్నం: జిల్లా పశుగణాభివృద్ధి సంఘం కొత్త పాలకవర్గ ఎన్నిక వివాదం కొత్త మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షలో ఇరువురు మంత్రులు అమీతుమీకి సిద్ధపడుతున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు తన అనుచరుడైన గాడు వెంకటప్పడును డీఎల్‌డీఏ కొత్త చైర్మన్‌గా ఎన్నికవడాన్ని జీర్ణించుకోలేని మరో మంత్రి అయ్యన్న పాత్రుడు పాతపాలకవర్గాన్ని కొనసాగించాలని తాను ఇచ్చిన సిఫారసు లేఖను పక్కన పెట్టి ఏవిధంగా ఎన్నికలు నిర్వహిస్తారంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన సిఫారసు లేఖ పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికార యంత్రాంగంపై సీఎంవోతో పాటు ఇన్చార్జి మంత్రి చినరాజప్పకు కూడా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌పై తీవ్రస్వరంతో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దీంతో జరిగిన తప్పును సరిదిద్దుకునేందుకు కలెక్టర్ ఆఘమేఘాల మీద ఆ ఎన్నికను నిలుపుదల చేశారు. మంత్రి లేఖ బయట పెట్టారన్న సాకుతో పశుసంవర్ధకశాఖ జేడీ కోటేశ్వరరావు, డీఎల్‌డీఏ ఈవో సూర్యప్రకాష్‌లను సరెండర్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా కొత్త పాలకవర్గ ఎన్నిక కొలిక్కివచ్చే వరకు ఈవోతో పాటు చైర్మన్ బాధ్యతలను జేసీ–2 ఎ.సిరికి అప్పగించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నిబంధనల మేరకు జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైనా కొత్త చైర్మన్ గాడు వెంకటప్పడు బృందం న్యాయపోరాటానికి సిద్ధమైనప్పటికీ మంత్రి గంటాతో ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. కాగా శుక్రవారం రాత్రి విశాఖనగరానికి వచ్చిన గంటాతో వెంకటప్పడు బృందం బేటీ అయ్యేందుకు యత్నించినా మంత్రికున్న కార్యక్రమాల వల్ల వీలు పడలేదు. దీంతో శుక్రవారం ఉదయం మంత్రితో బేటీ అయి జరిగిన పరిణామాలపై చర్చించనున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకే తమ ఎన్నికలు నిర్వహించారని, అలాంటప్పుడు మా ఎన్నిక చెల్లదనడం సరికాదని మంత్రి దృష్టికి తీసుకురానున్నారు.తమకు జరిగిన అన్యాయంపై చినరాజప్ప సమక్షంలో జరిగే సమావేశంలో చర్చించాలని కోరనున్నారు.ఈ వ్యవహారంపై మంత్రి గంటా కూడా సీరియస్‌గానే ఉన్నారు. ప్రతి చిన్న విషయాన్ని అయ్యన్న పాత్రుడు వివాదం చేస్తున్నారని ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. డీఎల్‌డీఏ పాత పాలకవర్గం ఇప్పటికే రెండు దఫాలు పనిచేసిందని, పైగా కాంగ్రెస్‌కు చెందిన వ్యక్తి చైర్మన్‌గా ఉన్న ఈ పాలకవర్గాన్ని ఇంకా కొనసాగించాలని సిఫారసు చేయడం పట్ల మంత్రి గంటా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మంత్రి సమక్షంలోనే చర్చించాలని భావిస్తున్నారు. మరో వైపు జరిగిన పరిణామాలు..తాను తీసుకున్న చర్యలపై కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ కూడా వివరణ ఇచ్చేం దుకు సిద్దమవుతున్నారు. సమీక్షలో డీఎల్డీఏపై ఇరువురు మంత్రులు సిగపట్లు çపడతారన్న చర్చ పార్టీలోనే జరుగుతుంది. అయితే సమీక్ష సందర్భంగా ఎలాంటి రచ్చ చేయొద్దని, పార్టీ కార్యాలయంలో కూర్చొని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామన్న ప్రతిపాదన చినరాజప్ప తెచ్చే అవకాశాలు కన్పిస్తు న్నాయి. సమీక్ష పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలపైనే జరగాలని, ఏదైనా సమస్యలుంటే పార్టీ అంతర్గత సమావేశంలో చర్చించుకుందామన్న ప్రతిపాదన పలువురు ఎమ్మెల్యేలు తీసుకొస్తున్నారు. సమీక్ష అనంతరం పార్టీ కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం జరుగనుంది. సమీక్షలో కాకున్నా పార్టీ సమావేశం లోనైనా రచ్చకెక్కిన ఈ అంశంపై చర్చ జరిగే అవకాశాలు లేకపోలేదని పార్టీ నేతలంటున్నారు. -
రోడ్డెక్కిన గోపాలమిత్రలు
- 67 మందిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ - ఆత్మహత్యాయత్నం చేసిన నరసింహులును బతికించాలి - పశుశాఖ, డీఎల్‌డీఏ కార్యాలయం ఎదుట బైఠాయింపు అనంతపురం అగ్రికల్చర్: తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని, ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతున్న నరసింహులుకు మెరుగైన వైద్యం చేయించాలని, డీఎల్‌డీఏ ఈవో తిరుపాలరెడ్డిపై చర్యలు తీసుకోవాలనే ప్రధాన డిమాండ్‌తో స్థానిక పశుసంవర్ధకశాఖ జేడీ కార్యాలయం, డీఎల్‌డీఏ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై గోపాలమిత్రలు శనివారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా గోపాలమిత్ర అసోసియేషన్ నాయకులు వెంకటేశ్, కిష్టప్ప, పెద్దన్న, శివారెడ్డి, రామాంజనేయులు, రాజబాబు, ఓబులేసు, గురివిరెడ్డి తదితరులు మాట్లాడారు. న్యాయం జరిగేదాకా ఆందోళన వీడేది లేదని హెచ్చరించారు. తమ డిమాండ్ల సాధనకు సమ్మె చేసినందున ఉద్యోగం నుంచి తొలగించడంతో చాలా మంది ఉపాధి లేక రోడ్డున పడ్డారన్నారు. తొలగించిన వారి స్థానంలో ఏకపక్షంగా కొత్తవారిని నియమించడం దారుణమన్నారు. ఈ వ్యవహారంపై గతంలో త్రిసభ్య కమిటీ చేసిన విచారణ నివేదిక బహిర్గం కాకుండా కొత్తవారిని నియమించడంపై మండిపడ్డారు. నరసింహులు లాంటి గోపాలమిత్రలు మరికొందరు ఉపాధి లేక, కుటుంబాన్ని పోషించుకోలేక బలన్మరణాలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆదోళన వ్యక్తం చేశారు.న్యాయం జరిగేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని నాయకులు హెచ్చరించారు. మరోసారి ఆందోళన బాట : ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో గోపాలమిత్రలు మరోసారి ఆందోళన బాట పట్టారు. గతేడాది అకారణంగా తొలగించిన 67 మంది గోపాలమిత్రలను విధుల్లోకి తీసుకోవాలని, అందుకు కారకులను డీఎల్‌డీఏ ఈఓ తిరుపాల్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఉద్యమానికి సిద్ధమయ్యారు. తొలగించిన గోపాలమిత్రలకు తోడుగా పనిచేస్తున్న వారు మద్దతు పలికి మూకుమ్మడిగా విధులు బహిష్కరించి సమ్మెలోకి వెళ్తామని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డీఎల్‌డీఏ) చైర్మన్ అల్లు రాధాకృష్ణయ్య, ఈఓ డాక్టర్ ఎన్.తిరుపాలరెడ్డి ముగింటకు సమస్య వచ్చి పడింది. ఈనెల 10న తలుపుల మండలానికి చెందిన తొలగించిన 11 మంది గోపాలమిత్రలు పురుగు మందు డబ్బాలతో ఆందోళన చేశారు. నరసింహులు అనే గోపాలమిత్ర శుక్రవారం ఆత్మహత్యానికి పాల్పడి, స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతుండడంతో అటు గోపాలమిత్రలు, ఇటు డీఎల్‌డీఏ అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో శనివారం గోపాలమిత్రలు ఆందోళనకు దిగారు. -
ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యం
అనంతపురం అగ్రికల్చర్: సమ్మెలో వెళ్లిన పాపానికి ఉద్యోగాల నుంచి తొలగించి రోడ్డున పడేలా చేశారని, ఆదుకోకపోతే పురుగుల మందు తాగి చచ్చిపోతామని పశుగణాభివృద్ధి సంస్థ (డీఎల్‌డీఏ)లో పనిచేస్తున్న గోపాలమిత్రలు ఆందోళనకు దిగారు. గురువారం సాయంత్రం స్థానిక డీఎల్‌డీఏ కార్యాలయం ఎదుట తలుపుల మండలానికి చెందిన తొలగించిన 11 మంది గోపాలమిత్రలు పురుగు మందు డబ్బాలు చేతపట్టుకుని తాగి చస్తామని ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఓబయ్య, ఓబుళకృష్ణ, వెంకటరమణ, బాలరాజు, జీసీ నరసింహులు, గౌస్‌లాజం, నాగార్జున, వెంకటరమణనాయక్, విజయకుమార్, ఆంజనేయులు, ఆదినారాయణ తదితరులు విలేకరులతో మాట్లాడారు. గతంలో సమ్మె చేసిన పాపానికి జిల్లా వ్యాప్తంగా 66 మంది గోపాలమిత్రలను తొలగించి వారి స్థానంలో కొత్తవారిని తీసుకున్నారన్నారు. పల్లెల్లో పశువులు, పాడి రైతులకు మంచి సేవలందించామని, తమ డిమాండ్ల సాధన కోసం గతంలో సమ్మె చేశామన్నారు. అంతకు మించి తమ తప్పు లేనందున అకారణంగా తొలగించారనే అంశంపై కలెక్టర్, పశుశాఖ జేడీ, డీఎల్‌డీఏ చైర్మన్, ఈవోతో పాటు పశుశాఖ డైరెక్టర్‌ను కూడా కలిసి విన్నవించామన్నారు. మరికొందరు కోర్టుకు కూడా వెళ్లారన్నారు. దీనిపై డీఎల్‌డీఏ ఈవో, పశుశాఖ జేడీ ఆ తర్వాత త్రిసభ్య కమిటీ జిల్లాకు వచ్చి తొలగించిన గోపాలమిత్రలను కలిసి విచారణ చేశారన్నారు. విచారణ కమిటీ నివేదిక రాకుండానే కొత్తవారిని విధుల్లో చేర్చుకునే యత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. తమకు న్యాయం జరిగేదాకా ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గోపాలమిత్రలు ఆందోళనకు దిగడంతో డీఎల్‌డీఏ అధికారులు కొత్త నియామకాలు నిలిపివేసి వారిని వెనక్కి పంపారు. -
గోపాలమిత్ర సూపర్వైజర్ పోస్టులకు ఇంటర్వ్యూలు
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో ఖాళీగా ఉన్న 7 గోపాలమిత్ర సూపర్వైజర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న 30 మంది అభ్యర్థులకు గురువారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. స్థానిక జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డీఎల్‌డీఏ) కార్యాలయంలో ఈఓ డాక్టర్ ఎన్.తిరుపాలరెడ్డి అధ్యక్షతన జరిగిన ఇంటర్వ్యూలను పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ వి.రవీంద్రనాథఠాగూర్ పర్యవేక్షించారు. ఎంపిక చేసిన 10 మంది అభ్యర్థుల జాబితాను ఏపీఎల్డీఏ సీఈఓ డాక్టర్ కొండలరావుకు పంపినట్లు ఈఓ తెలిపారు. రెండు మూడు రోజుల్లో అర్హుల జాబితా వస్తుందన్నారు. ఆ తర్వాత ఖాళీగా ఉన్న 70 గోపాలమిత్రల పోస్టులకు కూడా ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని తెలిపారు.