పోలియోపై యుద్ధం కొనసాగిద్దాం
ఏలూరు అర్బన్: ఈ నెల 29, 30, 31 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహించనున్నామని డీఎంహెచ్‌వో డాక్టర్ కె.కోటేశ్వరి తెలిపారు. గురువారం స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయంలో వైద్యాధికారులకు ఏర్పాటు చేసిన వర్క్‌షాపులో డీఎంహెచ్‌వో మాట్లాడారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశాన్ని పోలియోరహితంగా ప్రకటించినా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెండు విడతల్లో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నామని తెలిపారు. దీనిలో భాగంగా జిల్లావ్యాప్తంగా జనవరిలో మూడు రోజులు ఏప్రిల్ నెల 2, 3, 4 తేదీల్లో నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్రమం జయప్రదం చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం జయప్రదం చేసేందుకు ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఐదేళ్లలోపు వయసున్న 3,99,000 మంది చిన్నారులను గుర్తించామన్నారు. వీరందరికీ పోలియో చుక్కలు అందించేందుకు అన్నిస్థాయిల అధికారులు, సిబ్బంది కషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డీఐవో డాక్టర్ డి.మోహనరావు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్ మిస్బా హని, ఆర్బీఎస్కే వైద్యాధికారి డాక్టర్. కె.సురేష్‌బాబు పాల్గొన్నారు.