డీఎంకే నేత హత్య
కేకే.నగర్:వాకింగ్‌కు వెళ్లిన డీఎంకే నగర కార్యదర్శి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన విల్లుపురం నార్త్ రైల్వే కాలనీలో చోటుచేసుకుంది. విల్లుపురం కేకేరోడ్డులో గల గణపతి లే అవుట్ ప్రాంతానికి చెందిన సెల్వరాజ్ (44). విల్లుపురం నగర డీఎంకే కార్యదర్శి. ఇతని భార్య జయభారతి. కుమారుడు విగ్నేష్ (21). పుదుచ్చేరిలో గల ప్రైవేటు వైద్య కళాశాలలో మెడిసిన్ చదువుతున్నాడు. బుధవారం ఉదయం 5.30 గంటలకు డీఎంకేకు చెందిన సెంథిల్, ప్రకాష్, ధరణి, కన్నన్, మణి ఈ ఐదుగురితో కలిసి సెల్వరాజ్ వాకింగ్‌కు వెళ్లాడు.
ఆ సమయంలో బైకుల్లో వచ్చిన ఐదుగురు సెల్వరాజ్‌పై కత్తులతో దాడి చేశారు. అడ్డుకున్న సెంథిల్, ప్రకాష్‌లను గాయపరిచారు. రక్తం మడుగులో పడి సెల్వరాజ్ మృతిచెందారు. సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సెల్వరాజ్ మృతదేహాన్ని అంబులెన్స్‌లో ముండియపాక్కం ప్రభుత్వాసుపత్రికి పంపారు. గాయపడిన ప్రకాష్, సెంథిల్లను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు. సమాచారం అందుకుని అధిక సంఖ్యలో డీఎంకే సభ్యులు గుమికూడడంతో సంచలనం కలిగించింది. ప్రాథమిక విచారణలో ఈ హత్య పాత కక్షల నేపథ్యంలో జరిగిందని తెలిసింది.