మత్తిచ్చి.. నిలువు దోపిడీ
డీఎంయూ రైలులో ఏడు తులాల బంగారు ఆభరణాల అపహరణ
బొబ్బిలి : విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న డీఎంయూ రైలులో ప్రయాణికులు కిక్కిరిసి ఉన్నా దంపతులకు మత్తు మందు ఇచ్చి నిలువు దోపిడీ చేశారు కొందరు దుండగులు. ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన దంపతులు తెలివి తెచ్చుకుని బొబ్బిలిలో ఉండే బంధువుల కు సమాచారం అందించడంతో వారికి బొబ్బిలి ప్రభు త్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి అనంతరం విశాఖ పంపించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నంలోని మల్కాపురంలో నివాసముంటున్న గండి భాస్కరరావు స్టీల్ ప్లాంటులో ఫోర్మన్గా పనిచేస్తున్నారు.
పార్వతీపురంలో దగ్గర బందువుల అమ్మాయి వివాహ నిశ్చితార్థం కార్యక్రమంలో పాల్గొనడానికి శుక్రవారం ఉదయం భార్య వసంతతో పాటు విశాఖలో డీఎంయూ రైలు ఎక్కారు. టీ తాగడానికి కిందకు దిగడానికి ప్రయత్నిస్తుండగా, ఎదురుగా కూర్చున్న యువకులు మీరు ఎందుకు వెళ్ల డం మేమే తెస్తామంటూ రెండు కాఫీలను తీసుకువచ్చారు. కాఫీలు తాగిన వెంటనే దంపతులిద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో భార్య వసంత వద్ద ఉన్న నెక్లెస్, చైన్, పుస్తెలతాడు, గాజులు, భాస్కరరావు వద్ద ఉండే బ్రాస్లెట్, గొలుసు, ఉంగరం వంటివి దుండగులు తెంచుకుని పారిపోయారు.
డీఎంయు రైలు ప్రతి కంపార్టుమెంటులో ప్రయణికు లు పుష్కలంగా ఉన్నప్పటికీ నిలువుదోపిడీ ఎంత చాకచక్యంగా జరిగిందో ఎవరికీ అర్థం కావడం లేదు.. విజయనగరం దాటిన తరువాత వీరిద్దరూ అపస్మారక స్థితిలో ఉండడం, వారి దగ్గర ఆభరణాలు ఏవీ లేకపోవడాన్ని తోటి ప్రయాణికులు గమనించి వారికి సపర్యలు చేశారు. దాంతో వారికి కొద్దిగా తెలివి రావడంతో అసలు విషయం గుర్తించారు. కాఫీ తాగిన తరువాత మత్తులోకి వెళ్లిపోవడాన్ని తెలుసుకొని జరిగి న మోసాన్ని, బం గారు ఆభరణాలు పోవడాన్ని గుర్తిం చారు.
ఇదే రైలులో బొబ్బిలి నుంచి ప్రయాణించడానికి వసంత చెల్లెలు నాగమణి, మిగిలిన బంధువులంతా సిద్ధమవుతుండగా గజపతినగరం వద్దకు వచ్చేసరికి వారికి ఫోన్లో బాధితులు సమాచా రం అందించారు. దాంతో బొబ్బిలిలో ఉండే బంధువులంతా రైల్వే స్టేషనుకు వచ్చి అపస్మారక స్థితిలో ఉన్న దంపతులను అక్కడ దించేసి 108లో ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ వారికి వైద్య సహాయం అందించినా, అపస్మారక స్థితి నుంచి ఎంతకూ బయటకు రాకపోవడంతో వెంటనే విశాఖ తరలించారు. అటు రైల్వే పోలీసులతో పాటు స్థానిక పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. దాదాపు ఏడు తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు బాధితులు వాపోతున్నారు.