ఇలాంటి డాక్టర్ దేవుళ్లూ ఉన్నారు
చెన్నై: కాసుల కక్కుర్తి కోసం శవాలకు సైతం చికిత్సలు చేసే కార్పొరేట్ డాక్టర్లున్న నేటి సమాజంలో లక్షలాది రూపాయలు వచ్చే అదే కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య వృత్తిని కాలదన్ని పేద పిల్లల గుండెలకు ఉచితంగా ఆపరేషన్లు చేస్తూ నిండు ప్రాణాలను నిలబెడుతున్న డాక్టర్లు కూడా ఉన్నారు. డాక్టర్ గోపి నల్లయాన్, డాక్టర్ హేమప్రియ నటేషన్ దంపతులు ఈ కోవకు చెందిన వారే. వృత్తిరీత్య హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో పనిచేసిన ఈ డాక్టర్ దంపతులు గుండె జబ్బులతో బాధ పడుతున్న తమ పిల్లలకు శస్త్రచికిత్సలు చేయించేందుకు డబ్బుల్లేక బాధపడుతున్న ఎంతోమంది తల్లిదండ్రుల దీనస్థితిని చూసి కరిగిపోయారు.
అంతే కార్డియాలజి నిపుణులైన డాక్టర్ గోపి దంపతులు తాము చేస్తున్న కార్పొరేట్, ప్రభుత్వ ఉద్యోగాలు వదిలేసి మధురై కేంద్రంగా ‘లిటిల్ మోపెట్ హార్ట్ ఫౌండేషన్’ ఏర్పాటు చేసి ‘కాంజెనిటల్ హార్ట్ డిసీస్’తో బాధపడుతున్న పేద పిల్లలకు ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నారు. పుట్టుకతో వచ్చే ఈ జబ్బు వల్ల మన దేశంలో ఏటా 78 వేల మంది పిల్లలు మరణిస్తున్నారు. ఈ జబ్బును సకాలంలో గుర్తించకపోవడం వల్ల, గుర్తించినా ఆపరేషన్ చేయించే ఆర్థిక స్థోమత లేకపోవడం వల్లనే ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారు. ఈ ఆపరేషన్‌కు మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెబుతున్నారు.
గతేడాది నవంబర్ నెలలోనే హార్ట్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసిన డాక్టర్ గోపి ఇంతవరకు 500 ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద పిల్లల్లో ఈ జబ్బును ముందుగానే గుర్తించేందుకు ఈ డాక్టర్ దంపతులు ఊరూరు, గడపగడప తిరుగుతూ పిల్లలకు గుండె పరీక్షలు చేస్తున్నారు. ఆపరేషన్ అవసరమైన వారికి మధురైలో ఫౌండేషన్ సహకారంతో నిర్వహిస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో భారీ జీతాలు అందుకున్నప్పుడు లేని ఆనందం పేద తల్లిదండ్రుల కళ్లల్లో కనిపించే ఆనందమే తమకు ఎక్కువ తృప్తిని ఇస్తోందని డాక్టర్ హేమప్రియ చెప్పారు. పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలకు వెళ్లి వైద్య పరీక్షలు చేయడంకన్నా గ్రామీణ ప్రాంతాల్లోని ఇంటింటికి తిరుగుతూ వైద్య పరీక్షలను చేయడం వల్ల తమకు ఎక్కువ ప్రయోజనం ఉన్నట్లు తెల్సిందని చెప్పారు.
ముందుగా మదురైతోపాటు సమీపంలోని అన్ని జిల్లాలో నివసిస్తున్న పేద ప్రజల పిల్లలకు హార్ట్ స్క్రీనింగ్ చేయాలనుకుంటున్నామని, ఫౌండేషన్‌కున్న పరిమితమైన నిధుల కారణంగా ఆశించిన మేరకు పనిచేయలేకపోతున్నామన్న కాస్త బాధ తప్పించి తాము సంతృప్తిగా వైద్య వృత్తిని జీవితంగా గడుపుతున్నామని డాక్టర్ గోపీ వ్యాఖ్యానించారు. వోర్సెస్, శ్యామ్ అనే తమ ఇద్దరు పిల్లలకు గోపీ దంపతులు గత డిసెంబర్ నెలల ఉచితంగా ఉపరేషన్ చేశారని, ఇప్పుడు తమ పిల్లలు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఆ పిల్లల తల్లిదండ్రులు తెలిపారు.