వామ్మోకరోనా.. కంటి చూపు కోల్పోతున్నారు!
హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్‌లో పరిస్థితి సీరియస్ అవుతున్నవారి సంఖ్య తక్కువగానే ఉంటున్నా.. ఆ కొద్దిమందిలో మాత్రం ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోంది. గతంలో 7 నుంచి 12 రోజుల్లో ఆరోగ్యం క్షీణిస్తే.. ఇప్పుడు నాలుగైదు రోజులకే ప్రమాదకరంగా మారుతోందని వైద్యులు చెప్తున్నారు. గతంలో పెద్ద వయసు వారిలో మాత్రమే ఆరోగ్యం ఎక్కువగా దెబ్బతినగా.. ఇప్పుడు పెద్దవారితోపాటు యువతలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ మధ్య పరిస్థితి సీరియస్ అయి.. ఆక్సిజన్ బెడ్, వెంటిలేటర్‌పైకి వెళ్లినవారిలో కంటిచూపు దెబ్బతింటోంది. రెటీనా ఇన్ఫ్లమేషన్ కనిపిస్తోంది. ఇది కొత్త లక్షణం అని వైద్యులు చెప్తున్నారు.
రాష్ట్రంలో వారంలో 4,432 కేసులు
తెలంగాణలో మార్చి 20–26 మధ్య 2,949 కరోనా కేసులు నమోదుకాగా.. మార్చి 27 నుంచి ఏప్రిల్ 2 వరకు 4,432 కేసులు నమోదు కావడం గమనార్హం. గతవారం మరణాలు 19గా ఉండగా, ఈ వారం 23కు పెరిగాయి. సగటున రోజుకు నాలుగు మరణాలు నమోదవుతున్నాయి. అయితే మొత్తంగా చూస్తే మరణాల సంఖ్య తక్కువగా ఉందని వైద్యారోగ్యశాఖ చెబుతోంది. కొత్త స్ట్రెయిన్ వైరస్ వేగంగా వ్యాపిస్తోందని.. మొదటి వేవ్‌లో 15 నిమిషాలు పాజిటివ్ రోగితో ఉంటే ఇతరులకు వైరస్ వ్యాప్తి జరిగేదని.. ఇప్పుడు నాలుగైదు నిమిషాలు ఉన్నా వ్యాపిస్తోందని స్పష్టం చేస్తోంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ..
►అందరూ మాస్కులు తప్పనిసరిగా పెట్టుకుంటే వైరస్ వ్యాప్తి నియంత్రణలో ఉంటుంది.
► ఎవరికైనా పాజిటివ్ వస్తే వారి కాంటాక్టులకు లక్షణాలు లేకున్నా టెస్టులు చేయాలి. లక్షణాలు లేనివారి నుంచి ఇతరులకు వ్యాపించే అవకాశం ఎక్కువ.
► వీలైనంత వరకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసుకోవాలి. టెస్టింగ్ సెంటర్లు కూడా పెరిగాయి.
► ఆఫీసుల్లోని క్యాంటీన్లు, కెఫెటేరియాల వంటి చోట మరింత జాగ్రత్తగా ఉండాలి.
► మొదటివేవ్లో కరోనా వచ్చినవారిలో ఇమ్యూ నిటీ ఉంటుంది. ఇప్పుడు వారికి వైరస్ సోకి నా లక్షణాలు కనిపించే అవకాశం తక్కువ.
కేసులు పెరగడం ఆందోళనకరం
సెకండ్ వేవ్‌లో కరోనా మరణాలు తక్కువగా ఉన్నాయి. కానీ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. భారత్‌లో 78 శాతం కేసులు మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌లోనే నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 14 శాతం కేసులు పెరిగాయి. దక్షిణాసియాలో నమోదైన కేసుల్లో 85 శాతం భారత్‌లో నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
– డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ