'ప్రభుత్వ వైద్యులపై చర్యలు తప్పవు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ డాక్టర్లకు మధ్య వివాదం మరింత ముదిరినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసిన ప్రభుత్వ వైద్యులపై చర్యలు తప్పవని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు మంగళవారం స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏజెన్సీలో 501 మంది డాక్టర్లను నియమిస్తామని తెలిపారు.
రాష్ట్ర ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందిస్తామని పేర్కొన్నారు. ఈ 25న ప్రైవేట్ ఆస్పత్రులతో సమావేశమై ప్యాకేజీలు ఖరారు చేస్తామన్నారు. హైదరాబాద్ లోని ఆస్పత్రుల్లోనూ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ 22న జీజీహెచ్ లో మోకాలికి చికిత్స చేయించుకుంటానని మంత్రి కామినేని వివరించారు. విధులకు సక్రమంగా హాజరు కాని 650 మంది ప్రభుత్వ వైద్యులకు ఏపీ ప్రభుత్వం ఇటీవలే నోటీసులు జారీ చేసిన విషయం అందరికీ విదితమే.