సీలేరు బేసిన్ మొత్తం ఆంధ్రప్రదేశ్‌కే
తెలంగాణకు దక్కని చింతూరు, డొంకరాయి జలవిద్యుత్ కేంద్రాలు
హైదరాబాద్: దిగువ సీలేరుతో పాటు డొంకరాయి జల విద్యుత్ కేంద్రాలు ఆంధ్రప్రదేశ్‌కు చెందనున్నాయి. పోలవరం ముంపుప్రాంతాల పేరుతో ఏడు మండలాల్లోని 208 నివాసిత ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన సంగతి తెలిసిందే. దీంతో 460 మెగావాట్ల సామర్థ్యం కలిగిన దిగువ సీలేరుతో పాటు, 25 మెగావాట్ల డొంకరాయి విద్యుత్ కేంద్రాలు ఆంధ్రప్రదేశ్‌కు చెందనున్నాయి. వాస్తవానికి లోయర్ సీలేరు విద్యుత్ కేంద్రం ఖమ్మం జిల్లాలోని చింతూరు వద్ద, డొంకరాయి వద్ద డొంకరాయి జల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. అయితే, ఈ ప్లాంట్లతో విద్యుత్ సంస్థలు కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కాస్తా 2039 వరకూ అమల్లో ఉంటుంది.
పీపీఏ ఉన్నంతవరకు ప్రతివిద్యుత్ కేంద్రం నుంచి ఒప్పందం మేరకు రెండు రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా కానుందని ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టంలో కేంద్రం స్పష్టం చేసింది. అప్పటివరకు తెలంగాణ ప్రాంతానికి విద్యుత్ వాటాలో ఇబ్బందులు లేకున్నప్పటికీ... 2039 తర్వాత మాత్రం ఈ ప్లాంటు మొత్తం ఆంధ్రప్రదేశ్‌కే చెందనుంది. తద్వారా ఈ ప్లాంటు నుంచి ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్ ఆంధ్రప్రదేశ్‌కే చెందనుంది. సాధారణంగా జల విద్యుత్ ప్లాంట్లలో ఏడాదిలో సగం రోజులు కూడా విద్యుత్ ఉత్పత్తి జరిగే అవకాశం ఉండదు. అయితే, ఈ ప్లాంట్లతో ఏడాదిలో సుమారు 300 రోజుల పాటు విద్యుత్ ఉత్పత్తి జరగనుంది. అంటే భారీ జల విద్యుత్ కేంద్రాలను తెలంగాణ నష్టపోనుందన్నమాట.