పాఠశాలకు రూ. 10 లక్షల విరాళం
మాక్లూర్ : పాఠశాలల అభివృద్ధి కోసం అవసరమైన నిధులు ఇవ్వడానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని డీఈవో లింగయ్య పేర్కొన్నారు. పాఠశాలల అభివృద్ధి కోసం గొట్టుముక్కుల మాజీ సర్పంచ్ బీరెల్లి రాజేశ్వర్‌రావు రూ. 10,00,501 చెక్కును అందించారు. ఈ నేపథ్యంలో బుధవారం గ్రామంలో రాజేశ్వర్‌రావు కుటుంబ సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ రాజేశ్వర్‌రావు గొట్టుముక్కుల గ్రామ ఉన్నత పాఠశాల అభివృద్ధికి రూ. 9 లక్షలు, రాంపూర్, మాందాపూర్, ధర్మోరా, మెట్పల్లి, గొట్టుముక్కుల, బొంకన్పల్లి ప్రాథమిక పాఠశాలలకు రూ. 1,00,501 అందించారన్నారు. దాతలు అందిస్తున్న సహకారంతో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు గంగాధర్, డిప్యూటీ ఈవో కృష్ణారావు, హెచ్ఎం రాజేశ్వర్‌గౌడ్, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కమలాకర్‌రావు, మండల అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ ఒడ్డెన్న తదితరులు పాల్గొన్నారు.