‘రేవంత్’ కేసులో అసలు దోషి బాబే: కవిత
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం డబ్బులు పంచుతూ దొరికిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యవహారంలో సూత్రధారి, అసలు దోషి చంద్రబాబేనని నిజామాబాద్ ఎంపీ కె.కవిత ఆరోపించారు. ఓటుకు నోటు వ్యవహా రంలో చంద్రబాబును ఎ-1 ముద్దాయిగా చేర్చాలన్నారు. బుధవారం నిజామాబాద్‌లో ఆమె మాట్లాడుతూ ఏపీలో తెలంగాణకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టిన చంద్రబాబు ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్ ఏడాది పాలనకు ఐదు మార్కులు వచ్చాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సున్నా మార్కులు వేశారని, దానిని గుర్తుంచుకోవాలన్నారు.
5న దుబాయ్, అబుదాబిలో కవిత పర్యటన
రాయికల్: దుబాయ్, అబుదాబిలో గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 5న నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ హాజరు కానున్నారు. దుబాయ్‌లో ఉదయం 9 గంటలకు, అబుదాబిలో సాయంత్రం 5 గంటలకు ఉత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు శ్రీనివాస్‌రావు, శ్రీనివాస్‌శర్మ, సల్లాఉద్దీన్, రమేశ్, పృథ్వీరాజ్ బుధవారం ‘సాక్షి’కి ఒక ప్రకటన ద్వారా తెలిపారు.