డబుల్ చిన్ సమస్యకు ఇంజెక్షన్లతోనే సరి!
కొత్త పరిశోధన
చాలామందికి గదమ కింద చర్మం వేలాడుతూ చూడ్డానికి కాస్త అసహ్యం కనిపిస్తుంటుంది. వయసు పైబడుతున్న కొద్దీ గదమ వెనక మరొక గదమలా చర్మం వేలాడుతూ కనిపించడం చాలా సాధారణం. దీన్నే ఇంగ్లిష్‌లో డబుల్ చిన్ అంటుంటారు. ఇప్పటివరకూ ఇలాంటి డబుల్చిన్ను సరిచేయడానికి లైపోసక్షన్ ప్రక్రియను ఎక్కువగా ఉపయోగించేవారు. కానీ అక్కడ పేరుకున్న కొవ్వును కరిగించే ఇంజెక్షన్లకు ఇటీవలే యూస్‌కు చెందిన ఎఫ్‌డీఏ అనుమతి ఇచ్చింది.
ఈ ఇంజెక్షన్లో డీఆక్సికోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది స్వాభావికంగా మన శరీరంలో ఉండే ఒక జీవరసాయనమే. ఇది కొవ్వును పూర్తిగా కరిగించి, అక్కడి నుంచి తొలగిస్తుంది. ఇలాంటి ఇంజెక్షన్లలో ఉండే మందుల వల్ల డబుల్ చిన్‌లో ఉండే కొవ్వు పూర్తిగా తొలగిపోవడమే గాక మళ్లీ రాకుండా ఉంటుందని దీని తయారీదార్లు పేర్కొంటున్నారు. పందొమ్మిది క్లినికల్ ట్రయల్స్‌లో దాదాపు 2,600 మందిపై దీన్ని ప్రయోగించి, అది ప్రభావవంతమని గుర్తించాక ఎఫ్‌డీఏ నుంచి అనుమతి లభించిందని పేర్కొంటున్నారు.