డారెన్ బ్రేవో ద్విశతకం
డునెడిన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఫాలోఆన్‌లో పడిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం దీటుగా ఆడుతోంది. డారెన్ బ్రేవో (404 బంతుల్లో 210 బ్యాటింగ్; 30 ఫోర్లు) కెరీర్లో తొలి డబుల్ సెంచరీతో చెలరేగడంతో శుక్రవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 139 ఓవర్లలో 6 వికెట్లకు 443 పరుగులు చేసింది. బ్రేవోతో పాటు స్యామీ (44 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం కరీబియన్ జట్టు 47 పరుగుల ఆధిక్యం సంపాదించింది.
శనివారం మ్యాచ్‌కు చివరి రోజు. ఆఖరి రోజు కివీస్ బౌలర్లు విండీస్‌ను తొందరగా ఆలౌట్ చేస్తే ఆ జట్టుకు విజయా వకాశాలు ఉంటాయి. 168/2 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన విండీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. శామ్యూల్స్ (23), చందర్‌పాల్ (1) వెంటవెంటనే అవుటైనా... బ్రేవో మాత్రం మూడు కీలక భాగస్వామ్యాలతో ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. దేవ్‌నారాయణ్ (52)తో ఐదో వికెట్‌కు 122 పరుగులు... రామ్‌దిన్ (24)తో కలిసి ఆరో వికెట్‌కు 56 పరుగులు; స్యామీతో కలిసి ఏడో వికెట్‌కు అజేయంగా 80 పరుగులు జోడించాడు. జీవంలేని వికెట్‌పై బ్రేవో అద్భుతమైన టెక్నిక్‌తో ఆడగా... కివీస్ ఫీల్డర్లు క్యాచ్‌లను మిస్ చేసి మూల్యం చెల్లించుకున్నారు. 82 పరుగుల వద్ద ఉన్నప్పుడు బ్రేవో క్యాచ్‌ను వాగ్నేర్ జారవిడవగా... 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దేవ్‌నారాయణ్ ఇచ్చిన క్యాచ్‌ను షార్ట్ కవర్లో మెకల్లమ్ వదిలేశాడు. సోధి 2, సౌతీ, బౌల్ట్, వాగ్నేర్, అండర్సన్ తలా ఓ వికెట్ తీశారు.