దోవల్ వస్తే పంచాయితీ పోతుందనుకోకండి: చైనా
న్యూఢిల్లీ: ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యను పరిష్కరించుకునే ఉద్దేశం చైనాకు ఏమాత్రం లేనట్లుంది. భారత్ నుంచి ఎలాంటి ప్రకటనలు రాకుండానే చైనా మీడియా మాత్రం రోజూ ఏదో ఒక ఆర్బాటం చేస్తూనే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి రోజు భారత్‌పై జపం చేస్తోంది. చైనాలో జరగనున్న బ్రిక్స్ సమావేశానికి భారత జాతీయ రక్షణ సలహాదారు దోవల్ వెళ్లనున్న నేపథ్యంలో ఆయన వచ్చినంత మాత్రాన ఇరు దేశాల మధ్య సమస్య పరిష్కారం అవుతందని భారత్ భావించొద్దని పేర్కొంటూ చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ తాజాగా ఓ కథనాన్ని వెలువరించింది.
ఈ నెల 27, 28 తేదీల్లో బ్రిక్స్ దేశాల జాతీయ సలహాదారుల సమావేశం చైనాలో జరగనుంది. ప్రస్తుతం చైనా, భారత్ మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నవారిలో దోవల్ ఒకరు. అయితే, ఈయన త్వరలోనే చైనాలో అడుగుపెట్టనున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు వివాదం సర్దుమణుగుతుందని ఆశించొద్దని పేర్కొంది. 'అన్ని ఊహాగానాలకు న్యూఢిల్లీ స్వస్తి పలకాలి. బీజింగ్‌లో జరగనున్న దోవల్ పర్యటన మా దేశంతో ఉన్న సరిహద్దు వివాధానికి పరిష్కారం ఇస్తుందని మాత్రం భావించొద్దు. బ్రిక్స్ సదస్సులో భాగంగా ప్రతిసంవత్సరం బ్రిక్స్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ సమావేశం జరగడం అనేది సాధారణమైన విషయం. ఇది చైనా-భారత్ మధ్య సమస్యల పరిష్కారానికి వేదిక కాదు' అంటూ చైనా మీడియా వెల్లడించింది.