టీడీపీలో సరికొత్త ముసలం పుట్టింది
సాక్షి ప్రతినిధి, ఒంగోలు :అసలే వర్గ విభేదాలతో సతమతమవుతున్న జిల్లా టీడీపీలో సరికొత్త ముసలం పుట్టింది. సొంత నియోజకవర్గాల్లో గెలుపు గ్యారంటీలేని కీలక నేతలు పక్క స్థానాల్లో కర్చీఫ్ వేస్తుండటంతో సరికొత్త విభేదాలు రాజుకుంటున్నాయి. ఇందుకు జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ కేంద్ర బిందువు కావడం గమనార్హం. ఒంగోలులో గెలుపు దుర్లభమని తేలడంతో ఆయన కందుకూరు నియోజకవర్గంపై కన్నేశారు. ఇందుకోసం హైదరాబాద్ స్థాయిలో చాప కింద నీరులా పావులు కదిపారు. దామచర్ల వ్యూహంపై ఉప్పందిన కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాం శివాలెత్తిపోయారు. ఆయన సంగతి తేలుస్తానంటూ హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చిందులు తొక్కారు. జిల్లా టీడీపీలో భగ్గుమన్న తాజా వర్గవిభేదాల కథా కమామిషు ఇదీ..
ఒంగోలులో గెలుపు అసాధ్యమని..
అసెంబ్లీలో అడుగుపెట్టాలని తపిస్తున్న దామచర్ల జనార్దన్ వ్యూహం మార్చారు. ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డిని మరోసారి ఢీకొనేందుకు ఆయన ససేమిరా అంటున్నారు. 1999 నుంచి అప్రతిహతంగా గెలుస్తున్న బాలినేనిని ఒంగోలులో అడ్డుకోవడం అసాధ్యమని ఆయన నిర్ధారణకు వచ్చేశారు. తనకున్న ప్రత్యామ్నాయ మార్గాలేమిటని యోచిస్తున్న దామచర్ల కన్ను కందుకూరు నియోజకవర్గంపై పడింది. గుడ్డికంటే మెల్లనయమన్నట్టుగా ఒంగోలు కంటే కందుకూరు కొంత పరవాలేదని ఆయన భావించారు. అలా అయితే తాను గెలుస్తానని కార్యకర్తలను ఎన్నికల వరకైనా కొంతవరకు నమ్మించవచ్చన్నది ఆయన ఉద్దేశం. అదే ఒంగోలులో అయితే ముందే కాడి దించేయాల్సిందేనని ఆయనకు స్పష్టమైంది. కందుకూరుకు మారిపోతే తన సొంతింటి ప్రత్యర్థి కరణం బలరాంతో కూడా సమస్య ఉండదన్నది ఆయన భావన. పార్టీ అధినేత చంద్రబాబు వద్ద తన మాటే చెల్లుబాటవుతుండటంతో ఆయనలో ధీమా మరింత పెరిగింది.
అందుకే దామచర్ల కందుకూరు టికెట్టు కోసం వ్యూహాత్మకంగా పావులు కదిపారు. చంద్రబాబుకు కూడా ఈ విషయాన్ని తెలపగా ఆయన సూత్రప్రాయంగా ఆమోదించినట్టు సమాచారం. దాంతో రెట్టించిన విశ్వాసంతో దామచర్ల కందుకూరు నియోజకవర్గ రాజకీయాల్లో జోక్యం చేసుకోసాగారు. ఆ నియోజకవర్గంలోని మండల స్థాయి నేతలతో మంతనాలు జరిపారు. వారిని ఒక్కొక్కరుగా తనవైపు తిప్పుకునేందుకు యత్నించారు. దివి శివరాం కంటే తానే మెరుగైన అభ్యర్థినని ఆయన చెప్పుకోసాగారు. తనకు చంద్రబాబు అండదండలున్నాయని కూడా జనార్దన్ చెబుతుండటం గమనార్హం. తాను కందుకూరు వస్తున్నట్టు అనధికారికంగా ప్రకటించసాగారు కూడా. త్వరలోనే నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని ఆయన భావిస్తున్నారు.
శివాలెత్తిపోయిన శివరాం
కాగా దామచర్ల ఎంత గుట్టుచప్పుడు కాకుండా పని ముగించేద్దామనుకున్నా కుదర్లేదు. కందుకూరులో ఆయన కదలికలపై మాజీ ఎమ్మెల్యే దివి శివరాంకు ఉప్పందింది. అంతే...! ఆయన ఒంటికాలిపై అంతెత్తున లేచారు. తాను జనార్దన్తో మాట్లాడేదేమిటని భావించిన శివరాం హైదరాబాద్లోనే తేల్చుకోవాలని భావించారు. అందుకే కొన్ని రోజుల క్రితం ఇదే విషయం మీద ఆయన హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడున్న పార్టీ సీనియర్ నేతలను కందుకూరు టికెట్టు విషయంపై వాకబు చేశారు. దామచర్ల జనార్దన్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు వారు శివరాంకు చెప్పారు. దాంతో ఆయన ఒక్కసారిగా భగ్గుమన్నారు. ‘అసలు నా నియోజకవర్గంపై కన్నేయడానికి జనార్దన్ ఎవరు?... ఆయనకున్న అర్హత ఏమిటి?... ఆయన తాత మంత్రిగా ఉన్నప్పుడే నేను ఖాతరు చేయలేదు.
నా నియోజకవర్గంలో వేలు పెట్టనివ్వలేదు. ఇక ఈయన ఎంత?... కందుకూరు నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటే నా తడాఖా చూపుతా. ఏమనుకుంటున్నారో ఏమిటో?’అని తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్టు తెలుస్తోంది. అదే ఊపులో శివరాం పార్టీ అధినేత చంద్రబాబుపై కూడా నిప్పులు చెరిగారు. ‘మూడుసార్లు ఓడిపోయినప్పటికీ ఇంకా అవే కుళ్లు రాజకీయాలు చేస్తుంటే ఎలా?... ఇప్పటికైనా మాట మీద నిలబడే రాజకీయాలు చేయాలి... లేకపోతే ఇక పార్టీని దేవుడు కూడా రక్షించలేడు’ అని దివి శివరాం కుండబద్దలు కొట్టారు.
జిల్లా పార్టీ అధ్యక్షుడు అయినప్పటికీ దామచర్ల తన నియోజకవర్గ వ్యవహారాల్లో కలుగజేసుకుంటే సహించేది లేదని శివరాం తేల్చిపారేశారు. ‘చెప్పాల్సిందంతా చెప్పాను... అయినా మారకపోతే నియోజకవర్గంలోనే బాహాబాహీ తేల్చుకుంటాను’అని ఆయన హెచ్చరిక స్వరంతో స్పష్టం చేసి వెనక్కి వచ్చేసినట్టు సమాచారం. ఈ పరిణామాలు జిల్లా టీడీపీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఉన్న విభేదాలతోనే సతమతమవుతుంటే దామచర్ల కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు మునుముందు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాల్సిందే!