విదేశీ విద్యకు స్పందన ఏదీ?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎస్సీ, ఎస్టీ గ్రాడ్యుయేట్ విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అంబేద్కర్ విదేశీ విద్యా నిధి పథకానికి స్పందన కరువైంది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ఈ ఏడాది అట్టహాసంగా ఈ పథకాన్ని ప్రారంభించినప్పటికీ.. పథకంపై విద్యార్థులకు అవగాహన కల్పించడంపై మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో ఈ పథకానికి తొలి ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 22 మంది మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా.. జిల్లా నుంచి కేవలం నలుగురు విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు పైచదువుల కోసం ఏటా సగటున 250 మందికిపైగా విదేశాలకు పరుగులు పెడుతున్నట్లు అంచనా. అయితే సర్కారు ప్రవేశపెట్టిన కొత్త పథకానికి స్పందన అత్యంత స్వల్పంగా ఉందంటే పథకంప్రచారం ఎలా ఉందో తెలుస్తోంది.
నలుగురంటే నలుగురే..!
అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం కింద జిల్లా వ్యాప్తంగా కేవలం నలుగురు విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఎస్సీ సంక్షేమ శాఖకు ముగ్గురు విద్యార్థులు, గిరిజన సంక్షేమ శాఖకు మరో విద్యార్థి దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా నలుగురు విద్యార్థుల దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. అర్హతలను బట్టి వారిలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అయితే హైదరాబాద్ జిల్లాలో ఎస్టీ కేటగిరీ నుంచి ఒక్క విద్యార్థి కూడా దరఖాస్తు చేసుకోకపోవడం గమనార్హం.