నాన్న... సామ్రాజ్యం
ఫస్ట్ పర్సన్
నాన్న డాక్టర్ అంజిరెడ్డి ఒక గొప్ప దార్శనికుడు!
అమ్మ సామ్రాజ్యం.. అభిమానాల సామ్రాజ్యం!
వీళ్లిద్దరూ పెంచిన మొక్క అనూరాధ!
ఇప్పుడు అనూరాధ పెద్ద చెట్టయింది.. ఓ సప్తపర్ణిలా!
ఓ కొమ్మన కళ, సంస్కృతి పూలను విరబూయిస్తూ..
మరో కొమ్మన చదువుల ఫలాలను పంచే చెట్టయింది!
ఇంటర్వ్యూ చేస్తామంటే వద్దన్నారు..
ఫొటోలు తీస్తామంటే కుదరదు అన్నారు..
నిశ్శబ్దంగా పనిచేయడం ఇష్టమన్నారు!
‘మీ పనితో పదిమంది స్ఫూర్తి చెందితే
పదివేలమంది పదిలంగా ఉంటారు’ అని చెబితే
‘సరే’నని ఒప్పుకున్నారు! ‘సాక్షి’కి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఫ్యామిలీలోని ఈ కొత్త శీర్షిక
ఫస్ట్ పర్సన్‌కు స్వాగతం.
కొంతమంది పిల్లలను చూస్తుంటే మనమెంత అదృష్టవంతులమో అనిపిస్తుంది. వాళ్లకూ చదువుకోవాలనుంటుంది. కాని ఇంట్లో పరిస్థితి అనుకూలంగా ఉండదు. నాన్న తాగుడుకు బానిసై ఉంటాడు, తల్లి ఎక్కడో పనిచేసుకొని వస్తుంది.. ఆ డబ్బులు సరిపోవు.. దాంతో చదువు మధ్యలోనే ఆపేసి ఆ పిల్లలూ ఏదో పనిని వెదుక్కునే అవసరం ఏర్పడుతుంది. అలాంటివి చూసినప్పుడే మనం ఎంత బాగా పెరిగామో.. అనిపిస్తుంది. అందుకే మా నాన్నగారికి (అంజిరెడ్డి) కూతురుగా పుట్టడం నాకు వరం! గర్వంగా ఉంటుంది. ఈ రోజు ‘డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్’ తరపున ఇలాంటి పిల్లలు చదువుకునేలా చేయడం నాన్నగారు ఇచ్చిన అవకాశమే. ఆయనది విశాల దృష్టి. గొప్ప ఆలోచన! అందరూ మంచివాళ్లే అని నమ్మేవారు. అదే మాకూ అబ్బింది. ఆ ఆలోచనా విధానమే ఆయన బలం! మాకూ అదే శక్తి! ఇది చెయ్.. అది చేయకు అంటూ మమ్మల్నెప్పుడూ ఒత్తిడి చేయలేదు. మేము ఏం చేసినా మెచ్చుకునేవారు. దేన్ని ఎలా చేయాలో ప్రత్యేకించి నేర్పలేదు. దేన్నయినా, ఏదైనా ఆయన్ని చూసి నేర్చుకోవడమే. ఆ మాటకొస్తే మాకు అమ్మా, నాన్న ఇద్దరూ గురువులే. అమ్మ కూడా (సామ్రాజ్యం) సింపుల్. నాన్న దగ్గర మేం దృక్పథాన్ని అలవరచుకుంటే అమ్మ దగ్గర నిరాడంబరతను నేర్చుకున్నాం. తాను మొదటి నుంచి లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో చాలా చురుగ్గా ఉండేవారు. అమ్మా నాన్న.. ఇద్దరూ కూతురుగా నాకెప్పుడూ ఆంక్షలు విధించలేదు. నేను పెట్టుకున్న పరిమితులే తప్ప వాళ్ల నుంచి అలాంటివి లేవు.
గృహిణిగా సంతృప్తి, సంతోషం
బీఎస్సీ ఫైనలియర్లో పెళ్లయింది. బిజినెస్ వ్యవహారాలకు నేను మొదటి నుంచీ దూరం. అంత ఆసక్తీ లేదు. ఇల్లు, భర్త, ముగ్గురు పిల్లలు, వాళ్ల చదువుల బాధ్యతలను చూసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నాను. మధ్యలోనే బడి మానేస్తున్న పిల్లల కోసం ఏదైనా చేయాలని అనుకుంటుండేవారు నాన్నగారు. ఏది మొదలు పెట్టినా ఇవ్వాళ చేశాం.. రేపటికి అయిపోయింది అన్నట్టుగా కాక.. తను ఉన్నా లేకపోయినా తాను ప్రారంభించిన సంస్థ వృత్తి నైపుణ్యాలతో.. కార్పోరేట్ సంస్థలా కొనసాగాలని అనుకునేవారు. ఆ ఉద్దేశంతోనే 1996లో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ (డీఆర్ఎఫ్)ను ప్రారంభించారు. అప్పుడు తనతోపాటు నన్నూ దానికి ట్రస్టీగా పెట్టారు. ఫౌండేషన్ బాధ్యతలన్నీ నళినీ గంగాధర్ చూసుకునేవారు. పదేళ్లకు (2006లో) నళినీ గంగాధర్ సొంత సంస్థను అభివృద్ధి చేసుకోవాలని ఈ సంస్థ నుంచి వెళ్లిపోయారు. అప్పుడు డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ బాధ్యతను నేను తీసుకోవాల్సి వచ్చింది. ఆ పనంతా నాకు కొత్తే! భయంగానే భారాన్ని తలకెత్తుకున్నాను. ఫౌండేషన్ బృందంతో కలిసి పనిచేస్తూనే కొత్త విషయాలను తెలుసుకున్నాను! అయితే ఇక్కడ నా టీమ్‌ని ప్రశంసించాలి. నాకు చాలా మద్దతుగా నిలబడింది.
డీఆర్ఎఫ్... చారిటీ కాదు
పద్దెనిమిదేళ్లు పైబడిన వాళ్లకు జీవన నైపుణ్యాలు నేర్పించి వారికి ఉపాధి చూపించడం దగ్గర మొదలైంది డీఆర్ఎఫ్ ప్రయాణం. పుడమి పేరుతో 25 పాఠశాలలను నడుపుతున్నాం. ఓ 50 ప్రభుత్వ పాఠశాలలకూ సహకారం ఇస్తున్నాం. బాగా చదువుకునే పిల్లలకు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి ఒక అవరోధంగా మారకూడదు. డబ్బులేని కారణంగా వాళ్ల చదువు ఆగిపోకూడదు. అందుకే మంచి మార్కులు వచ్చి, ఆర్థికంగా వెనుకబడి ఉన్న విద్యార్థులకు ఉపకార వేతనాలనూ అందిస్తున్నాం.. ఆ డబ్బుతో వాళ్లు పైచదువులకు వెళ్లడానికి. డీఆర్ఎఫ్లో ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ ఉంది. అందులో బోధనా పద్ధతులు, పాఠ్యాంశాలకు సంబంధించిన అధ్యయనం, పరిశోధన జరుగుతుంటాయి. ఇక జీవనోపాధికి సంబంధించి దేశవ్యాప్తంగా వంద కేంద్రాలు పనిచేస్తున్నాయి. క్షేత్రస్థాయి పర్యవేక్షణ కోసం ఆ కేంద్రాలకు వెళ్లినప్పుడు స్థానికుల ఆదరణ చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఇలా సేవ చేయడం అదృష్టమనిపిస్తుంది. అలాగని దీన్ని చారిటీ అనను. నాన్నగారు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తా.
అదే లక్ష్య నినాదం.. అదే అంకిత భావం
ఈ ఫౌండేషన్ వల్ల ఎంతోమంది పిల్లలకు మేలు జరుగుతోంది. నాన్నగారికి చాలా ఆలోచనలు ఉండేవి. సమయానుగుణంగా వాటిని అమలు చేసుకుంటూ పోవడమే నా భావి ప్రణాళిక. నాన్నగారు అనుకున్నట్లు ఈ సంస్థ మేం లేకపోయినా నడవాలి. అదే లక్ష్య నినాదంతో.. అదే అంకితభావంతో! అందుకే వీలైనంత వరకు విస్తరిస్తూ పోతున్నాం. ప్రస్తుతం.. రైతులు, వికలాంగుల కోసం పనిచేస్తున్నాం. ఇలా భవిష్యత్తులో కూడా వీలైనన్ని అంశాల మీద దృష్టి పెడతాం. ఈ స్ఫూర్తి కొనసాగేలా చూస్తాం!
చేసింది చాలా తక్కువ
ఐ నెవర్ రిగ్రెట్ ఫర్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. గృహిణిగా ఆ బాధ్యతను చాలా ఇష్టపడ్డాను. డీఆర్ఎఫ్ డెరైక్టర్‌గా ఈ పనినీ అంతే నిబద్ధతతో నెరవేరుస్తున్నాను. అయితే చేసింది చాలా తక్కువనే భావన. ఇంకా ఏదో చేయాల్సి ఉండిందని.. చేయాలనీ ఉంటుంది.
ప్రతివాళ్లకూ ఒక ప్రత్యేకమైన నైపుణ్యం ఉంటుంది. దాన్ని అనుసరించాలి. ఆసక్తి ఉన్న పనిని అలక్ష్యం చేయకుండా చేతల్లోకి దిగాలి.
- సరస్వతి రమ
సప్తపర్ణి
సప్తపర్ణి నా సొంత ఐడియా. పిల్లలకు చదువే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాల మీద మీద కూడా శ్రద్ధ కల్పించాలనే ఉద్దేశంతో సప్తపర్ణిని స్థాపించాను. ఈ విషయంలో జిడ్డు కృష్టమూర్తి, విద్యారణ్య పాఠశాల నాకు స్ఫూర్తి. ఎంతసేపూ బిజినెస్.. సోషల్ వర్కే కాకుండా ఆర్ట్ అండ్ కల్చర్ కూడా జీవితంలో భాగం కావాలి కదా! అందుకే ఈ సప్తపర్ణి. అయితే నా ఈ ఆలోచనను బాగా ప్రోత్సహించి దీనికి రూపమిచ్చింది మాత్రం నా భర్త ప్రసాద్. అసలు నేను ఇవ్వాళ ఇన్ని పనులను ఇంత తేలికగా పూర్తి చేయగలుగుతున్నానంటే కూడా కారణం ప్రసాద్ నాకు అండగా ఉండడమే! ఎన్ని చేసినా మనసులో మాత్రం గృహిణి హోదాకే ఎక్కువ మార్కులు వేసుకుంటా! నిజానికి అది చాలా ఇంపార్టెంట్. కుటుంబ బాధ్యతల్ని, సామాజిక సేవనీ రెండిటినీ సమన్వయం చేయడం కష్టం, కానీ ముఖ్యం!