డయాబెటిక్ కౌన్సెలింగ్
నేను ఇటీవలే రక్తపరీక్ష చేయించుకుంటే నాకు డయాబెటిస్ బార్డర్‌లైన్‌లో ఉందన్నారు. అంటే నాకు డయాబెటిస్ వచ్చినట్లేనా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి.
- సునీల్, భట్టిప్రోలు
మీరు పరగడపున రక్తపరీక్ష చేయించుకున్నప్పుడు రక్తంలోని చక్కెర పాళ్ల విలువ 100 కంటే తక్కువ ఉండటం; భోజనం చేశాక చేయించిన రక్తపరీక్షలో ఆ విలువ 140 కంటే తక్కువ ఉండటం జరిగితే మీకు డయాబెటిస్ లేదని అర్థం. ఒకవేళ మీరు పరగడుపున చేయించిన పరీక్షలో రక్తంలోని చక్కెర పాళ్ల విలువ 125 కంటే ఎక్కువగానూ, భోజనం చేసిన తర్వాత చేసిన రక్తపరీక్షలో ఆ విలువ 200 కంటే ఎక్కువగానూ, హెచ్‌బీఏ1సీ అనే పరీక్షలో వచ్చిన విలువ 6.5 శాతం కంటే ఎక్కువగానూ ఉంటే మీకు డయాబెటిస్ ఉన్నట్లు లెక్క. ఇలా కాకుండా పూర్తిగా డయాబెటిస్ లేకుండా ఉండి, ఆ విలువలకు దగ్గరగా రక్తపరీక్షల ఫలితాలు వస్తే అప్పుడు దాన్ని బార్డర్‌లైన్ డయాబెటిస్ అంటారు. అంటే డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ అన్నమాట.
ఇలాంటివారు రోజూ కనీసం ఒక గంట సేపు వ్యాయామం చేయడం, తాము తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు తక్కువగా తీసుకోవడం, స్థూలకాయం లేకుండా చూసుకోవడం చేస్తుంటే చాలాకాలం పాటు డయాబెటిస్ దరిచేరకుండా కాపాడుకోవచ్చు.
డాక్టర్ అరుణ్,
ఎండోక్రైనాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్