కేర్ హాస్పిటల్స్ భారీ విస్తరణ
♦ కొత్తగా మరిన్ని ఆసుపత్రులు
♦ అడ్వెంట్ వాటా అబ్రాజ్ గ్రూప్ చేతికి
♦ సాక్షితో కేర్ ఫౌండర్ డాక్టర్ బి.సోమరాజు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న కేర్ హాస్పిటల్స్ భారీగా విస్తరిస్తోంది. హైదరాబాద్ గచ్చిబౌలిలో ప్రతిపాదిత హెల్త్ సిటీలో ఔట్ పేషెంట్ సెంటర్‌ను ఏడాదిలో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. బంజారాహిల్స్ ఔట్ పేషెంట్ కేంద్రం మాదిరిగా దీనిని నిర్మించనున్నారు. వైజాగ్ హెల్త్ సిటీలో రూ.100 కోట్లతో 250 పడకల హాస్పిటల్ ఏడాదిలో సాకారం కానుంది. ఈ నగరంలో సంస్థ ఇప్పటికే మూడు కేంద్రాలను నిర్వహిస్తోంది.
విజయవాడలో కేర్‌కు 4 ఎకరాల స్థలం ఉంది. 250 పడకలతో కొత్తగా ఆసుపత్రి నిర్మించే అవకాశం ఉంది. లేదా ఇప్పటికే విజయవాడలో ఉన్న ఏదైనా ఆసుపత్రిని కొనుగోలు చేసే అంశాన్నీ పరిశీలిస్తున్నట్టు కేర్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ బి.సోమరాజు బుధవారమిక్కడ వెల్లడించారు. కేర్‌లో ప్రధాన వాటాదారుగా ఉన్న అడ్వెంట్ వాటాను దుబాయికి చెందిన అబ్రాజ్ గ్రూప్ కొనుగోలు చేస్తోంది. ఈ విశేషాలను ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో పంచుకున్నారు. అందుబాటు ధరలో వైద్య సేవలు అందించడంపై ఇరు సంస్థలు ఫోకస్ చేస్తాయని చెప్పారు.
ప్రారంభానికి సిద్ధంగా..
భాగ్యనగరిలో రాయదుర్గం వద్ద ఏర్పాటు చేస్తున్న ఆసుపత్రి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. సామర్థ్యం 250 బెడ్స్ కాగా, రూ.200 కోట్లు ఖర్చు చేశారు. ఈ కేంద్రాన్ని మార్చిలో ప్రారంభించేందుకు కేర్ సమాయత్తమవుతోంది. అలాగే రూ.100 కోట్లతో నిర్మిస్తున్న భువనేశ్వర్ కేంద్రాన్ని ఈ ఏడాదే తెరుస్తామని సోమరాజు పేర్కొన్నారు. హైదరాబాద్‌సహా 9 నగరాల్లో సంస్థ 16 ఆసుపత్రులను నిర్వహిస్తోంది. పడకల సంఖ్య 2,600 పైమాటే. కేర్ చరిత్రలో ఇప్పటి వరకు 60 లక్షల మంది ఔట్పేషెంట్లు, 10 లక్షలకుపైగా ఇన్‌పేషెంట్లకు వైద్య సేవలను అందించింది. భారత్‌లో 5వ అతిపెద్ద వైద్య సంస్థగా ఎదిగింది. వైద్యం ఇప్పుడు ఖరీదైందని.. వైద్య పరికరాలు, ఔషధ తయారీ సంస్థలు కొన్ని సందర్భాల్లో వైద్య రం గాన్ని శాసిస్తున్నాయని సోమరాజు చెప్పారు. ప్రభుత్వం తన పాత్ర మర్చిపోయిందన్నారు. పరిశ్రమలో నియంత్రణ వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడ్డారు.
కేర్‌లోకి అబ్రాజ్ గ్రూప్..
కేర్‌లో ప్రధాన వాటాను అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్ 2012 ఏప్రిల్‌లో రూ.523 కోట్లకు కొనుగోలు చేసింది. కేర్‌లో మొత్తంగా అడ్వెంట్ రూ.650 కోట్లదాకా పెట్టుబడి చేసింది. అడ్వెంట్ ఇంటర్నేషనల్‌కు సంస్థలో 72 శాతం, సోమరాజుతోసహా ఇతర వాటాదారులకు 28 శాతం వాటా ఉంది. సంస్థలో అడ్వెంట్‌కు ఉన్న వాటాను అబ్రాజ్ గ్రూప్ కొనుగోలు చేస్తోంది. మార్చికల్లా ఈ డీల్ పూర్తి కానుంది. ఇందుకోసం అబ్రాజ్ గ్రూప్ సుమారు రూ.1,800 కోట్లు వెచ్చిస్తోందని సమాచారం. వాటాలు మారినప్పటికీ మేనేజ్మెంట్లో ఎటువంటి మార్పు లేదని సోమరాజు వెల్లడించారు. ఈ సంస్థ కేర్‌లో ప్రస్తుతం రూ.200 కోట్లు పెట్టుబడి పెడుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని కొత్త ఆసుపత్రులకు వెచ్చిస్తామని చెప్పారు.