బాలీవుడ్లో చేయాలని ఉంది
న్యూఢిల్లీ: తనకు బాలీవుడ్ సినిమాలో నటించాలని ఉందని అమెరికన్ పాపులర్ టీవీ షో ‘బిగ్ బ్యాంగ్ థియరీ’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కునాల్ నయ్యర్ తెలిపాడు. ఢిల్లీలో మూలాలున్న కునాల్ 2011లో మాజీ మిస్ ఇండియా నేహా కపూర్‌ను వివాహం చేసుకుని ఢిల్లీలోనే కాపురం పెట్టాడు. ఇప్పటికే బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ నిర్మించిన కెనడియన్ సినిమా ‘డాక్టర్ కెబ్బే’లో నటించాడు. ఒక భారతీయుడిగా తనకు బాలీవుడ్ సినిమాలో నటించాలని కోరిక ఎప్పటినుంచో మనసులో నాటుకుపోయిందని అతడు చెప్పాడు.
అయితే మంచి ప్రాజెక్టు కోసం వేచిచూస్తున్నానని చెప్పాడు. తాను నటించే భారతీయ చిత్రం దేశం నలుమూలలా మంచి పేరు గుర్తింపు తెచ్చేవిధంగా ఉండాలనేది తన కోరిక అని అన్నాడు. తాను నటుడినని..కెమెరా ముందు నిలబడితే చాలు.. అది ఇండియాలో అయినా యూఎస్‌లో అయినా.. నటనలో నిమగ్నమైపోతానని చెప్పాడు. పాత్ర బట్టి తన తీరు ఉంటుంది తప్ప భాష, ప్రాంతం బట్టి ఉండదని ఆయన స్పష్టం చేశాడు. ఒకసారి తనపై కెమెరా పెడితే తనలోని నటుడు పాత్రకనుగుణంగా చేసుకుంటూ పోతాడని.. అతడికి హాలీవుడ్, బాలీవుడ్ అనే తేడాలుండవని వ్యాఖ్యానించాడు.
ఇదిలా ఉండగా, నయ్యర్ ఇటీవల క్రికెట్‌పై డాక్యుమెంటరీని నిర్మించాడు. ‘క్రికెట్ వరల్డ్ కప్ -2011: బియాండ్ ఆల్ బౌండరీస్’ అనే ఈ లఘుచిత్రం ఇండియాలో ఈ నెలలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా నయ్యర్ మాట్లాడుతూ.. క్రికెట్కుసంబంధించిన ఎటువంటి విషయమైనా భారత ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనేది జగమెరిగిన సత్యమని, అందుకే ఆ ఆటను అంశంగా చేసుకుని డాక్యుమెంటరీని నిర్మించానని తెలిపాడు. ఇటువంటి డాక్యుమెంటరీని ఇంతకుముందు ఎవరూ నిర్మించలేదని ఘంటాపథంగా చెప్పగలనని నొక్కిచెప్పాడు.
భారత క్రికెట్ చరిత్రలో 2011 వరల్డ్ కప్ ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించిందని చెప్పాడు. భారత ప్రజలు ఈ కప్‌ను ఎప్పటికీ మరిచిపోరని, అందుకే దానిపై డాక్యుమెంటరీ నిర్మించానని తెలిపాడు. కాగా, కునాల్ లండన్‌లో పుట్టాడు.. ఢిల్లీలో పెరిగాడు. అక్కడే తన స్కూల్ చదువు పూర్తిచేసుకున్నాడు. అనంతరం ఉన్నతవిద్య కోసం అమెరికా వెళ్లి అక్కడ ఫైన్ ఆర్ట్స్‌లో మాస్టర్ డిగ్రీ సంపాదించాడు. మొదటిసారి ‘ఎన్సీఐఎస్’లో అతిథి పాత్ర పోషించాడు. తర్వాత ‘ది బిగ్ బ్యాంగ్ థియరీ’లో డాక్టర్ రాజ్ కూత్రపల్లిగా నటి ంచే అవకాశం లభించింది. దాంతో అతడు వెనుదిరిగి చూసుకోలేదు.