రాయల తెలంగాణఎవరడిగారు?
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్: ఏ ప్రజలు కోరుతున్నారని కేంద్రం రాయల తెలంగాణ విషయాన్ని అనధికారికంగా బయటకు తెస్తుందని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ప్రశ్నించారు. స్థానిక క్లాక్‌టవర్ సెంటర్ వద్ద సోమవారం రాత్రి జరిగిన శ్రీకాంతాచారి 4వ వర్ధంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజ ల ఆకాంక్ష మేరకు 10జిల్లాల తెలంగాణను ప్రకటించాలని డిమాండ్ చేశారు. అందుకు విరుద్ధంగా చేసే ఏ ప్రయత్నాన్నయినా ప్రజ లు అంగీకరించరని, మరో ఉద్యమానికి సిద్ధం కాగలరని హెచ్చరించారు.
రాష్ట్రాలను విడదీయడం అవయవ సౌష్టంలా ఉండదని ఏ రాష్ట్రంలోనూ ఆ మాదిరిగా జరగలేదన్నారు. రాయలసీమ, తెలంగాణ అస్తిత్వాలకు భంగం కలిగేలా ఉభయులకు అంగీ కారం కాని వ్యర్థ ప్రయత్నాలను విరమించుకోవాలన్నారు. తెలంగాణకు ఫ్యాక్షనిస్టుల జాడ్యం అవసరం లేదన్నారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో ఏదైనా ఒక జిల్లాకు శ్రీకాంతాచారి పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అతడి జయంతి ఆగస్టు 15న, వర్ధంతి డిసెంబరు 3ను ప్రభుత్వపరంగా నిర్వహించాలని కోరారు. క్లాక్‌టవర్ సెంటర్ వద్దకు వచ్చి నివాళులర్పించే నాయకులెవ్వరికీ పక్కనే ఉన్న శ్రీకాంతాచారి విగ్రహానికి దండవేయాలని గుర్తుకు రాకపోవడం విచారకరమన్నారు.
తెలంగాణ జాగృతి సంస్థ జిల్లా కన్వీనర్ బోనగిరి దేవేందర్, బీడీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ జేఏసీ జిల్లా చైర్మన్ జి.వెంకటేశ్వర్లు, కన్వీనర్ గోలి అమరేందర్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఆదిరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, కె.పర్వతాలు, పి.వెంకటేశ్వరమూర్తి, డీటీఎఫ్ నేత సోమ య్య, జమాల్‌ఖాద్రి, పన్నాల గోపాల్‌రెడ్డి, పున్న కైలాష్ పాల్గొన్నారు. అంతకుముందు వేదిక నుండి కొవ్వొత్తులతో శ్రీకాంతాచారి విగ్రహంవరకు ప్రదర్శన నిర్వహించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు.