కవితాక్షేత్రంలో ఒక మహావృక్షం
సినారె మృతికి అదృష్టదీపక్ సంతాపం
రామచంద్రపురం :
అభ్యుదయ భావాలను శ్వాసిస్తూ, ఆధునిక కవిత్వాన్ని శాసించిన అగ్రశ్రేణి కవి సి.నారాయణరెడ్డి అని ప్రముఖ సినీ గేయ రచయిత, కవి, విమర్శకులు అదృష్ణదీపక్ తెలిపారు. సినారె మృతికి ఆయన సోమవారం సంతాపం తెలిపారు. కుర్రకారుతో పోటీపడుతూ చలన శీలమైన ఆలోచనలతో క్రమం తప్పకుండా ప్రతి పుట్టిన రోజునా ఒక కొత్త కవితా సంపుటితో అభిమానులను అలరింజేసిన సినారె నిస్సందేహంగా తెలుగు కవితాక్షేత్రంలో ఒక మహావృక్షం. తెలుగు సాహిత్యాన్ని సారస్వత సభలనూ అపారమైన విద్వత్తుతో, చమత్కారాలతో రసప్లావితం చేసిన సరస్వతీనది ఈవేళ అంతర్ధానమైపోయిందని పేర్కొన్నారు. సాహితీ లోకంలో మేరు పర్వతం ఒరిగిపోయిందని, పద్యమైనా, గద్యమైనా, గేయమైనా తనదైన ముద్రతో సారవంతం చేసి భావితరాలకు మార్గదర్శకుడయ్యాడు. అంగారమైనా, శృంగారమైనా హద్దులు దాటని భావాలను అలవోకగా అందించిన అక్షర శిల్పిసినారె. అందమైన పంచెకట్టుతో అచ్చమైన తెలుగుతనానికి చిరునామాగా నిలిచిన పెద్దదిక్కు సినారె. భౌతికంగా దూరమైనా తెలుగు భాషా సాహిత్యాలపై చెరిగిపోని సంతకం చేసిన నిత్యయవ్వనుడు సినారె. మాదాల రంగారావు, టీ.కృష్ణ, సినిమాలకు సినారెతో కలిసి పనిచేసిన సందర్భాలు నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకాలుగా మిలిగిపోతాయి’ అని అదృష్టదీపక్ తన జ్ఞాపకాలను వివరించారు.