పరిశోధన వ్యాసాలను ప్రచురించాలి
వడ్డేశ్వరం (తాడేపల్లి రూరల్)
శాస్త్రవేత్తల పరిశోధనా వ్యాసాల ప్రచురణ ద్వారా విద్యార్థులకు చేరువై వాటిని ఆకళింపు చేసుకున్నప్పుడే వారి పరిశోధనా ఫలాలు ఫలిస్తాయని సీఎస్ఈఆర్ పూర్వ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ కైలాష్ అన్నారు. వడ్డేశ్వరంలోని కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం (కేఎల్‌యూ)లో శాస్త్ర పరిశోధనలు- మెలకువలపై రెండు రోజుల జాతీయసదస్సును ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కైలాష్ మాట్లాడుతూ పరిశోధనా వ్యాసాలు ప్రచురణకు సంబంధించి చైనా అత్యంత నాణ్యత ప్రమాణాలు పాటిస్తోందన్నారు. చైనా తరువాత అమెరికా కూడా ఈ విషయంలో రాజీ పడదన్నారు. వివిధ రంగాలపై పరిశోధనలు పెరగాలని, సంబంధిత ప్రచురణలు అందుబాటులోకి తీసుకురావడం వల్ల విద్యార్థులు అధునాతన విషయాలు తెలుసుకోగలరని ఆయన చెప్పారు. కార్యక్రమంలో కేఎల్ యూ చాన్సలర్ డాక్టర్ ఎల్.ఎస్.ఎస్. రెడ్డి, డీన్ కె.ఎల్. నారాయణ, సదస్సు కోఆర్డినేటర్ శివాజి, కె. సుబ్రహ్మణ్యం, పి.వి. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కేఎల్యూసెంట్రల్ లైబ్రరీ, పరిశోధనా అభివృద్ధి విభాగం సంయుక్తంగా సదస్సును నిర్వహించాయి. ఈ సందర్భంగా సదస్సు ఉద్దేశాలు లక్ష్యాలతో రూపొందించిన సావనీర్‌ను డాక్టర్ కైలాష్, డాక్టర్ ఎల్.ఎస్.ఎస్. రెడ్డి తదితరులు ఆవిష్కరించారు.