పాదాల వాపు తగ్గేదెలా..?
నా వయసు 62. రెండు నెలలుగా తరచూ కాళ్లు, పాదాలలో కొద్దిపాటి వాపులు వస్తున్నాయి. నీరసంగా కూడా ఉంటోంది. పదేళ్లుగా మధుమేహానికి చికిత్స తీసుకుంటున్నాను. రక్తపోటు సక్రమంగానే ఉంది. డాక్టరుగారు పరీక్షలన్నీ చేసి, గాబరా పడాల్సిందేమీ లేదన్నారు. దయచేసి ఈ సమస్యకు ఆయుర్వేద మందులు తెలియజేయప్రార్థన.
- సుగుణమ్మ, వరంగల్
గుండెజబ్బులు, కిడ్నీసమస్యలు, నెత్తురు తక్కువగా ఉండటం వంటి సందర్భాల్లో మీరు చెప్పిన వాపులు కనపడతాయి. చికరాల మధుమేహ వ్యాధిలో కూడా కొన్ని ఉప్రదవాలు ఉంటాయి. వాటిలో కాళ్లవాపులు కూడా ఒకటి. మీరు రాసినదాన్ని బట్టి ప్రత్యేకమైన వ్యాధులేమీ లేనట్లుగా కనబడుతోంది. ఈ కింది మందులు ఒక నెలపాటు వాడి ఫలితాన్ని పరిశీలించండి.
గోక్షురాది గుగ్గులు (మాత్రలు) ఉదయం ఒకటి, రాత్రి ఒకటి చంద్రప్రభావటి ( మాత్రలు ) ఉదయం ఒకటి, రాత్రి ఒకటి
= శిలాజిత్వాటివటి (మాత్రలు )ఉదయం ఒకటి, రాత్రి ఒకటి.
వీలుంటే ‘తిప్పతీగె’ ఆకులు, కాండాన్ని దంచి, కషాయం కాచుకుని 30 మి.లీ. ఉదయం, రాత్రి ఖాళీ కడుపున తాగండి. తేలికపాటి వ్యాయామం చేయండి. కూర్చున్నప్పుడు కాళ్లను కాస్త ఎత్తుగా ఉంచాలి. ప్రాణాయామం రెండుపూటలా చేయండి.
మా బాబు వయసు ఏడేళ్లు. గత నాలుగు నెలలుగా ముఖం మీద గోధుమరంగు మచ్చలు వస్తున్నాయి. చర్మంపై కీళ్ల దగ్గర చిన్నపొక్కుల్లాగ కనపడుతున్నాయి. ఆహారం తక్కువగా తింటాడు. సరియైన ఆయుర్వేద చికిత్స సూచింపగలరు.
- లలిత, నిడదవోలు
మీరు చెప్పినదాన్ని బట్టి బాబుకి విటమిన్ ‘ఎ’ అనే పోషకాహారం లోపించినట్లుంది. ఆహారంలో మునగకాడలు, మునగాకులు (లేతవి) వండి తినిపించండి. తాజాఫలాలలో దానిమ్మ, జామ, సీతాఫలం, బొప్పాయి వంటివి చాలా మంచిది. అన్నిరకాల ఆకుకూరలు, క్యారట్, బీట్రూట్ మొదలైనవి బాగా ఇవ్వండి. బయటి ఆహారం తినకుండా చూడండి. చాక్లెట్లు, ఐస్క్రీములు, శీతలపానీయాల జోలికి పోవద్దు. బరువు 15 కిలోలు ఉండేట్లు, నెత్తురు సక్రమ పరిధిలో ఉండేట్లు జాగ్రత్తలు తీసుకోండి. ఈ కింది మందులు ఒక రెండు నెలల పాటు వాడండి.
ఆరోగ్యవర్థని (మాత్రలు) రోజుకి ఒకటి విడంగారిష్ట, అవవిందాసవ ద్రావకాలను, ఒక్కొక్క చెంచా గ్లాసులో పోసుకుని, రెండు చెంచాల నీళ్లు కలిపి, రెండుపూటలా ఏదైనా తిన్న తర్వాత తాగించండి.
డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్),
సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్,
హుమయున్ నగర్, హైదరాబాద్