పులిపిర్లను సర్జరీతో తొలగించవచ్చా!
డాక్టర్ సలహా
నా వయసు 27. నాకు గత నాలుగేళ్ల నుంచి చేతులు, ముఖం మీద పులిపిర్లు వస్తున్నాయి. మొదట్లో రక్తహీనతతో ఇలా వస్తుందని, మంచి ఆహారం తీసుకుంటే తగ్గిపోతుందనుకున్నాను. కొందరేమో ఇదొక చర్మవ్యాధి అని చెబుతున్నారు. స్నేహితులు పూత మందులు వాడాలని, కడుపులోకి మందులు తీసుకోవాలని చెబుతున్నారు. నాకు పులిపిర్ల సంఖ్య, సైజు పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. బ్యూటీపార్లర్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి భయంగా ఉంది. అధునాతన కాస్మటిక్ సర్జరీలో సుశిక్షితులైన డాక్టర్లు పులిపిర్లను తొలగించడానికి సర్జరీ చేస్తారని తెలిసింది. నేను ఆ చికిత్స చేయించుకోవచ్చా? నా సమస్యకు పరిష్కారం తెలియ చేయగలరు.
- పి. ఉషారాణి, హైదరాబాద్
పులిపిర్లలో ప్రధానంగా వైరల్ వార్ట్స్, స్కిన్ గ్రోత్ వార్ట్స్ అని రెండురకాలు ఉంటాయి. వైరల్ వార్ట్స్కు మందులతో చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇన్ఫెక్షన్తో కూడిన ఈ వార్ట్స్ని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తొలగించడం కుదరదు. చర్మవ్యాధి నిపుణులు (డెర్మటాలజిస్ట్) పరీక్షించి తగిన మందులు ఇస్తారు. స్కిన్ గ్రోత్ వార్ట్స్ని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తొలగించవచ్చు. ముందు మీకు వచ్చినవి ఏ రకమైన పులిపిర్లు అనేది స్వయంగా పరీక్షించి నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు దగ్గరలో ఉన్న చర్మవ్యాధి నిపుణులను లేదా కాస్మటిక్ సర్జన్ (ప్లాస్టిక్ సర్జరీ)ను సంప్రదించండి. మీకు ఏ రకమైన చికిత్స అవసరమో వారు సూచించగలుగుతారు.
మీకు వచ్చినవి స్కిన్ గ్రోత్ వార్ట్స్ అయితే వాటిని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా పూర్తిగా తొలగించవచ్చు. సాధారణంగా ఇవి చర్మం మీద సిస్ట్ ఏర్పడడం, కొవ్వు చేరడం, పుట్టుమచ్చ పెరిగి బుడిపెలా మారడం... ఇలా రకరకాల కారణాలతో వస్తాయి. వీటి చికిత్స కోసం హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేకుండా ఒక రోజులోనే చికిత్స పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లిపోవచ్చు.
బ్లడ్ షుగర్, సిబిపి (కంప్లీట్ బ్లడ్ పిక్చర్) వంటి సాధారణ పరీక్షలు చేసిన తర్వాత లోకల్ అనస్థీషియా ఇచ్చి వీటిని తొలగిస్తారు. ఆపరేషన్ అయిన మరుసటి రోజే కాలేజీలు, ఆఫీసులకు వెళ్లవచ్చు. దుమ్ముధూళిలో తిరిగినా, ఎండలో వెళ్లినా ఇబ్బంది ఉండదు. అయితే డాక్టర్ సూచించిన ఆయింట్మెంట్ రాసుకుని వెళ్లాలి. సర్జరీ తర్వాత వారం రోజులకు ఒకసారి, ఆ తర్వాత నెలరోజులకోసారి తదనంతర పరిణామాలు, సలహాల కోసం డాక్టర్ను సంప్రదించాలి. ఆహార మార్పుల వంటి ప్రత్యేక జాగ్రత్తలేవీ అక్కరలేదు.
- డాక్టర్ మురళీమనోహర్, ప్లాస్టిక్ సర్జన్