ఇక అడవి సురక్షితం!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, పరిపాలన సౌలభ్యం కోసం అటవీశాఖకు సంబంధించిన పునర్వ్యవస్థీకరణ ఫైలుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. అటవీశాఖను పటి ష్ట పరచాలని మూడున్నరేళ్లుగా అధికారులు చేసిన సిఫారసులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జిల్లాల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఇప్పటికే పలుమార్లు చర్చించారు. ఉన్నతస్థాయి అధికారులు సమర్పించిన నివేదికల మేరకు నిజామాబాద్ సర్కిల్ పరిధిలోని నిజామాబాద్, మెదక్ డివిజన్లలో అటవీ డివి జన్లు, రేంజ్‌లు, సెక్షన్, బీట్ల సంఖ్య పెరగనుంది.
సర్కిల్, డివిజన్, రేంజ్ కార్యాలయాల పెంపుతో పాటు అధికారులు, సిబ్బంది కొరత నివారణకు ఉద్యోగుల నియామకం, తదితర అంశాలపై మార్గదర్శకాలను నిర్దేశిస్తూ అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్లకు రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
నర్పట్‌సింగ్ నివేదికతో కదలిక
మాజీ ఐఎఫ్ఎస్ అధికారి, అటవీశాఖ పునర్వ్యవస్థీకరణ కమిటీ చైర్మన్ డాక్టర్ నర్పట్‌సింగ్ ఏడాది పాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, అధ్యయనం చేశారు. అటవీ, వన్యప్రాణుల సంరక్షణ, కలప రవాణాలను అడ్డుకునేందుకు ఆయన నివేదికలో మార్గదర్శనం చేశారు. జిల్లాలో ఇకపై ఐఎఫ్ఎస్ క్యాడర్ కలిగిన అధికారులనే ఫారెస్టు కన్జర్వేటర్, డిప్యూటీ కన్జర్వేటర్, డీఎఫ్ఓలుగా నియమించాలని సూచించారు.
అధికారులకు తగ్గనున్న పరిధి
అటవీశాఖలో మార్పులు, చేర్పులకు శ్రీకారం జరగనున్న నేపథ్యంలో డివిజన్, రేంజ్, బీట్ అధికారులకు అటవీ పరిధి తగ్గనున్నది. ప్రస్తుతం ఒక్కో డివిజన్లో 1,473 చదరపు కిలోమీటర్లు కాగా, 750 చదరపు కిలోమీటర్లకు తగ్గనుంది. ఒక్కో డివిజన్లో మూడు నుంచి నాలుగు రేంజ్‌లు, సెక్షన్ పెరుగుతుండటంతో బీట్ ఆఫీసర్ల పరిధి 25 చదరపు కిలోమీటర్ల నుంచి 15 చదరపు కిలోమీటర్లకు తగ్గనుంది.
నిజామాబాద్ అటవీ సర్కిల్ పరిధిలో నిజామాబాద్, మెదక్ డివిజన్లు ఉండగా.. ఈ రెండిం టిని త్వరలోనే విడదీసి రెండు సర్కిళ్లు చేయనున్నారు. దీంతో నిజామాబాద్ జిల్లాలోని రెండు డివిజన్లు నాలుగుకు పెరగనున్నాయి. రేంజ్‌లు 7నుంచి 12కు పెరగనున్నాయి. మెదక్ డివిజ న్లో మాత్రం ఫారెస్టు డివిజన్లు, రేంజ్‌లు యథాతథంగా ఉంటాయి. అదే విధంగా రెండు డివిజన్లలో ప్రస్తుతం ఉన్న 52 సెక్షన్లు 61కి, 207గా ఉన్న బీట్లు 239కి పెరుగుతాయి.
అమలుపై అధికారుల కసరత్తు
అటవీశాఖ పునర్వ్యస్థీకరణ ఉత్తర్వుల అందడంతో వాటి అమలుకు జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను దశల వారీగా అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్న అధికారులు మొదటగా నిజామాబాద్, కామారెడ్డి డివిజన్ల పరిధిలో వర్ని, సిరికొండలలో రేంజ్ కార్యాలయాల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నిజామాబాద్ డివిజన్లో 3 రేంజ్‌లు, 14 సెక్షన్లు, 52 బీట్లు, కామారెడ్డి డివిజన్లో 4 రేంజ్‌లు, 18 సెక్షన్లు, 60 బీట్లుండగా పునర్వ్యవస్థీకరణలో మరిన్ని పెగనున్నాయి.
అలాగే భవిష్యత్‌లో ప్రత్యేక సర్కిల్‌గా రూపుదిద్దుకోనున్న మెదక్ డివిజన్లో ఇప్పటికే ఆరు రేంజ్‌లు, 20 సెక్షన్లు, 95 బీట్లుండగా పునర్వ్యవస్థీకరణలో భాగంగా వాటి సంఖ్య మరింత పెరగనుంది. మొత్తానికి మూడున్నరేళ్ల కిందటి ప్రతిపాదనలు, సిఫారసులకు ప్రభుత్వం దశల వారీగా ఆమోదం తెలుపుతుండటం.. డివిజన్లు, రేంజ్‌లు, సెక్షన్లు, బీట్లు పెరగనున్న నేపథ్యంలో అటవీశాఖకు కొత్త జవజీవాలు రానున్నాయి. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, పరిపాలన సౌలభ్యం కోసం పునర్వ్యవస్థీకరణ జరిగితే మంచి ఫలితాలుఉంటాయని అధికారులు అభిప్రాయ పడుతున్నారు.