‘సమైక్యం’తోనే అభివృద్ధి
ఒంగోలు, న్యూస్‌లైన్ :రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. సమైక్య రాష్ట్ర సాధన కోసం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా ఆటోలు, రిక్షాలతో గురువారం సమైక్య ర్యాలీలు నిర్వహించారు. రిక్షా కార్మికులు తాము సైతం అంటూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైఎస్సార్సీపీ సమైక్య ర్యాలీకి సంఘీభావం ప్రకటించారు. కందుకూరులో జిల్లా కన్వీనర్, కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త నూకసాని, మరో సమన్వయకర్త ఉన్నం వీరాస్వామిలు ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అక్కడి నుంచి పట్టణంలోని అన్ని ప్రధాన వీధుల్లో ర్యాలీ సాగింది.
ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు నాందిపలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సమైక్యాంధ్ర పేరుతో ఉద్యమాలు చేయడం హాస్యాస్పదమన్నారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు చేశామంటూ తప్పుడు ప్రకటనలివ్వడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. మార్కాపురంలో నియోజకవర్గ సమన్వయకర్తలు వెన్నా హనుమారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డిలు పార్టీ కార్యాలయం వద్ద ర్యాలీని ప్రారంభించారు. అనంతరం పట్టణ వీధుల నుంచి ర్యాలీ కోర్టు సెంటర్ వద్దకు చేరుకోగా పార్టీ కార్యకర్తలు అక్కడ రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సమన్వయకర్తలు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం ఏ పార్టీ కట్టుబడి ఉందో జనానికి స్పష్టంగా అర్థమవుతోందన్నారు.
సమైక్య శంఖారావానికి అడ్డంకులు సృష్టించిన సీఎం ఏ రకమైన సమైక్యవాదో తేటతెల్లమైందన్నారు.
ఒంగోలులో పార్టీ జిల్లా కార్యాలయం వద్ద ర్యాలీని జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్‌లు ప్రారంభించారు. అనంతరం ర్యాలీ ప్రధాన రహదారుల్లో సాగింది. చర్చి సెంటర్లోని వైఎస్సార్ విగ్రహం వద్ద ఆటోలను వలయంగా ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ కేంద్రమంత్రులు, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ఇకనైనా డ్రామాలు ఆపాలని మండిపడ్డారు. ప్రజలను నిత్యం మభ్యపెట్టగలమని భావిస్తే అది రాజకీయ జీవితానికి గ్రహపాటుగా మారుతుందని హెచ్చరించారు.
రాష్ట్ర విభజన ఆగేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించినట్లు అసెంబ్లీని సమావేశపరిచి సమైక్యాంధ్రకు సంఘీభావంగా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి రాజ్యాంగ సంక్షోభం సృష్టించడం ఒక్కటే మార్గమన్నారు. కనిగిరిలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త ముక్కు కాశిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో ప్రకాశం జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, రైతు కూలీలు సమైక్యాంధ్రకు సంఘీభావం ప్రకటించేందుకు ముందుకు రావాలని కోరారు. యర్రగొండపాలెంలో గురువారం సాయంత్రం ఆటో రిక్షాల ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజు మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాకుంటే పశ్చిమ ప్రకాశం మొత్తం ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
గిద్దలూరులో నియోజకవర్గ సమన్వయకర్తలు ముత్తుముల అశోక్‌రెడ్డి, వై.వెంకటేశ్వరరావులు ఆటోరిక్షాల ర్యాలీని ప్రారంభించారు. రాష్ట్ర విభజనతో విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఉద్యమంలో విద్యార్థులు ప్రధాన పాత్ర పోషించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సూరా పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చీరాల పోస్టాఫీస్ సెంటర్లో నియోజకవర్గ సమన్వయకర్తలు సజ్జా హేమలత, అవ్వారు ముసలయ్యలు ర్యాలీని ప్రారంభించారు. సాల్మన్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించే సమైక్య శంఖారావానికి ప్రతి ఒక్కరూ కదిలిరావాలని పిలుపునిచ్చారు.