'జీసస్కు జన్మనివ్వబోతున్నా..'
వాషింగ్టన్: జెరుసలేంలోని ఏసుక్రీస్తు సమాధిపై చలువరాతిని ఏ క్షణంలో తెరిచారోగానీ ఆ భగవత్ స్వరూపుడిపై వింతవింత వార్తలు నిరంతరంగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన 19 ఏళ్ల అవివాహిత యువతి.. తాను గర్భవతినని, త్వరలోనే జీసస్ కు జన్మనివ్వబోతున్నానని వెల్లడించి అందరినీ షాక్ కు గురిచేసింది.
'ఒక అద్భుతం జరుగుతున్నప్పుడు ఎవ్వరూ నమ్మరు. నా కడుపులో జీసస్ పెరుగుతున్నాడన్న విషయాన్ని కూడా ఎవ్వరూ నమ్మట్లేదు. అద్భుతం జరిగాక.. అంటే, నేను జీసస్ కు జన్మనిచ్చాక లోకరక్షకుడి ముందు అందరూ మోకాళ్లువంచి నమస్కరిస్తారు' అని 19 ఏళ్ల హాలే అంటున్నారు. వినడానికే విస్మయం కలిగిస్తోన్న ఈ విషయం అసలెలా బయటికొచ్చిందంటే..
ప్రస్తుతం టీవీల్లో ప్రసారం అవుతోన్న కుటుంబ పంచాయితీల తరహాలోనే అమెరికాలో మానసిక వ్యాధిగ్రస్తులకు సంబంధించిన టీవీ కార్యక్రమ 'డాక్టర్ ఫిల్ షో' చాలా ఫేమస్. వింత వింత మానసిక వ్యాధుల బారినపడ్డవాళ్లు, వారి కుటుంబ సభ్యులు చెప్పే ఆసక్తికరమైన విషయాలెన్నో చూపిస్తారా షోలో. ఇటీవలే హాలే, ఆమె తల్లి క్రిస్టీతో కలిసి 'డాక్టర్ ఫిల్ షో'లో పాల్గొన్నారు. తాను జీసస్ కు జన్మనివ్వబోతున్నట్లు చెప్పిన ఆమె.. గతంలో తాను అమెరికన్ ఐడల్ పోటీలో పాల్గొన్నానని, జబ్బుతో బాధపడుతోన్న సోదరుడికి అవయవదానం చేశానని, ఇంకా ఏవేవో చెప్పుకుంది.
కాగా, హాలే చాలాకాలంగా 'కంపల్సీవ్ డిజార్డర్'అనే మానసిక వ్యాధితో బాధపడుతోందని, ఉన్నవి లేనట్లు, లేని వున్నట్లు ఊహించుకుంటుందని గర్భదారణ కూడా అలాంటి భ్రమేనని ఆమె తల్లి క్రిస్టీ చెప్పారు. ప్రెగ్నెస్సీకి సంబంధించిన 22 రకాల పరీక్షల్లోనూ ఫలితాలు నెగటివ్ అనే వచ్చాయని ఆమె తెలిపారు. చివరికి షో హోస్ట్ డాక్టర్ ఫిల్ మాట్లాడుతూ.. 'హాలే సుదీర్ఘకాలం చికిత్స తీసుకుంటే తప్ప ఆమె మానసిక వ్యాధి నయం కాదు'అని తేల్చారు.