తొలి సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ
- హైదరాబాద్ సీపీగా మహేందర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్‌రెడ్డి
- పదవీ విరమణ చేసిన మహంతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ రాజీవ్ శర్మ నియమితులయ్యారు. అలాగే తొలి డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా అనురాగ్‌శర్మను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఉమ్మడి రాజధానిగా ఉంటున్న హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా ఎం.మహేందర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బి.శివధర్‌రెడ్డి నియమితులయ్యారు.
1982 బ్యాచ్‌కు చెందిన రాజీవ్ శర్మ పలు కీలక శాఖల్లో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం డెప్యుటేషన్‌పై కేంద్ర హోం శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆయన రూర్కీలో ఐఐటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ చేశారు. తరవాత ఇంగ్లండ్‌లోని అంగీలియాలో గ్రామీణాభివృద్ధిలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశారు. అమెరికాలోని మిలన్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేశారు. 1982లో ఐఏఎస్‌గా ఎంపికై ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వచ్చారు. కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్‌గా, డెరైక్టర్ పోర్ట్స్, పురపాలక శాఖ స్పెషల్ కమిషనర్, సాంకేతిక విద్య డెరైక్టర్, వ్యవసాయ శాఖ కమిషనర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్య కార్యదర్శి, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డెరైక్టర్ జనరల్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శిగా పని చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియలో కీలక భూమిక పోషించారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి అవసరమైన సమాచారాన్ని అందించడమేకాక, ఆ కమిటీకి కార్యదర్శిగా వ్యవహరించారు.
మహంతి పదవీ విరమణ
ప్రస్తుత ప్రభుత్వ సీఎన్ మహంతి ఆదివారం పదవీ విరమణ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను నియమించాక ఆయన తప్పుకున్నారు. మరో నెలరోజులు గడువున్నా ఈ నిర్ణయం తీసుకున్నారు.
సంతోషంగా ఉంది: అనురాగ్ శర్మ
తెలంగాణ రాష్ట్ర తొలి డీజీపీ కావడం సంతోషంగా ఉందని అనురాగ్ శర్మ సాక్షితో అన్నారు. పోలీసు శాఖలో కీలకమైన ఈ పదవిని నిర్వహించడం కత్తిమీద సామే అయినా ప్రజా సేవకు ఎక్కువ అవకాశముంటుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా తనకు ఎన్నికల బందోబస్తులో, శాంతిభద్రతల పరిరక్షణలో నగర పోలీసు సిబ్బంది, అధికారులు వెన్నుదన్నుగా నిలిచారంటూకృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ డీజీపీగా సోమవారం ఉదయం 7.15కు ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక ఆయన స్థానంలో సీపీగా వస్తున్న మహేందర్‌రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం అదనపు డీజీగా ఉన్నారు.
ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు చేపట్టనున్న శివధర్‌రెడ్డిని ఇటీవలే వైజాగ్ సీపీ బాధ్యతల నుంచి తప్పించి తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగానికి అటాచ్ చేశారు. వీరిద్దరూ సమర్థులైన అధికారులుగా పేరు తెచ్చుకున్నారు. అత్యుత్తమ సేవలందించినందుకు రాష్ట్రపతి పోలీసు పతకాలు అందుకున్నారు. మహేందర్‌రెడ్డి 1986, శివధర్‌రెడ్డి 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారులు. మహేందర్‌రెడ్డి నిజామాబాద్ ఎస్పీగా, హైదరాబాద్ తూర్పు మండలం డీసీపీ, గ్రేహౌండ్స్ కమాండెంట్, సైబరాబాద్ నగర పోలీసు కమిషనర్, ఎన్పీఏ డీఐజీగా చేశారు. ఐదేళ్లుగా ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నారు. శివధర్‌రెడ్డి శ్రీకాకుళం, నల్లగొండ జిల్లాల ఎస్పీగా, ఎస్ఐబీ డీఐజీ, వైజాగ్ సీపీగా పలు హోదాల్లో పని చేశారు. వీరిరువురూ సోమవారం నూతన బాధ్యతలు స్వీకరించనున్నారు.