నేపాల్ రిపోర్టింగ్కి వెళ్లి ప్రాణం పోశాడు
కఠ్మండు: నేపాల్లో భూకంపం తర్వాత పరిణామాలని రిపోర్టింగ్ చేయడానికని వెళ్లిన జర్నలిస్ట్ ఒకరు బ్రెయిన్ ఆపరేషన్ చేసి అమ్మాయి ప్రాణాలని కపాడాడు. న్యూరోసర్జన్ అయిన సంజయ్ గుప్తా నేపాల్లోని కిక్కిరిసిన ఆస్పత్రిని చూసి తప్పనిసరి పరిస్థితులలో తన జర్నలిస్ట్ విధులను పక్కన బెట్టి 15 ఏళ్ల అమ్మాయికి బ్రెయిన్ ఆపరేషన్ చేశాడు.
శనివారం సంభవించిన భూకంపం మూలంగా ఇంటిగోడ కూలి మీద పడటంతో సంధ్యకి తీవ్ర గాయాలయ్యాయి. నేపాల్ లోని మారుమూల ప్రాంతంలో నివాసముండటంతో సంధ్యని కఠ్మండులోని బిర్ ఆస్పత్రికి తీసుకురావడానికి రెండు రోజుల సమయం పట్టింది. ఆస్పత్రి వచ్చేసరికి సంధ్య తల భాగం ఎండిన రక్తం మరకలతో నిండి ఉంది..
'ఆస్పత్రిలో పేషెంట్లు ఎక్కవగా ఉండి డాక్టర్లు తక్కువగా ఉన్నారు. వారికి మరో నైపుణ్యం ఉన్నడాక్టర్ అవసరం అని గ్రహించి అక్కడున్న డాక్టర్లని సంప్రదించాను. దీంతో ఆపరేషన్ చేయడానికి వారు అంగీకరించారు. ఆపరేషన్ తర్వాత ఆ బాలిక పరిస్థితి నిలకడగానే ఉంది. ఆ సర్జరీ చేసిన తర్వాత మరో ఎనిమిదేళ్ల బాలిక కూడా అదే రకమైన బాధతో అక్కడికి చేరుకుంది. అక్కడున్న భూకంప బాధితులు సహయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రపంచంలోని ఎన్నోరకలైన పరిస్థితులను చూసాను, కానీ ఇలాంటి హృదయ విధారకమైన దృశ్యాలను ఎక్కడా చూడలేదని' అని సంజయ్ గుప్తా అన్నారు. ఒక మీడియా సంస్థలో చీఫ్ మెడికల్ కరస్పాండెంట్ సంజయ్ గుప్తా విధులు నిర్వర్తిస్తున్నారు.