మొగుళ్లకు అర్థం కాదా!?
అమ్మ పొత్తిళ్లు బిడ్డకు స్వర్గం అనిపిస్తాయి. మరి అమ్మకో? నలభైతొమ్మిది శాతం బాలింతలకు నరకంగానే అనిపిస్తుందట! ‘ఇంపాజిబుల్. ఇది సత్యం కాదు’ ‘తల్లికి బిడ్డను చూస్తే నరకమా’? ‘యూజ్లెస్ టాక్’!‘బుద్ధిలేనోళ్లు కావాలని ప్రచారం చేస్తున్న అసత్యమిది’. ఇవీ మొగుళ్ల కామెంట్స్. కొంతమంది అత్తలు కూడా ఇదే అంటారేమో!కానీ, పరిశోధన క్లియర్‌గా చెబుతున్న విషయం... ప్రతి ఇద్దరు బాలింతలలో ఒకరు తీవ్రమైన డిప్రెషన్‌కు గురవుతున్నారని! ఈ విషయం అర్థం చేసుకొని బాలింతలకు అండగా నిలవాలన్నదే మనందరి ప్రయత్నం కావాలి. దిస్ ఈజ్ నాట్ ఎ పాయింట్ ఫర్ డిస్కషన్. దిస్ ఈజ్ ఎ పాయింట్ ఫర్ యాక్షన్.మొగుళ్లూ... తండ్రులమైపోయామని గొప్పలు చెప్పుకోవడం కాదు...పిల్లల ఆలనాపాలనలో కొంచెం పాలుపంచుకోండి.పెళ్లాలకు ఫుల్ సపోర్ట్ ఇవ్వండి. పేరెంట్ అంటే మీరు కూడా సార్! డోన్ట్ ఫర్గెట్!!
పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ లక్షణాలు
- ప్రతిదానికి త్వరగా ఏడ్చేయడం
- విపరీతంగా చికాకుపడటం
- బాధపడటం
- చిన్న విషయానికీ విసుగు చెందడం
- ఆహారం సహించక పోవడం
- నిద్ర లేకపోవడం
- కుంగి పోవడం
- అనవసర విషయాలకు ఆందోళన చెందడం
- లైంగిక వాంఛ తగ్గడం
- తప్పు చేసినట్టు భయపడటం
- జీవితం శూన్యంగా అనిపించడం
బిడ్డ ఏడిస్తే తల్లి ఆనందపడే ఏకైక సందర్భం- జననం. నిజమే! పుట్టిన వెంటనే బిడ్డ ఏడిస్తే తల్లికి ఆనందం. ఆ ఏడుపుతోనే పురిటినొప్పుల యాతనను మర్చిపోవాలి.
కాని ఆ ఆనందం స్థానంలో చాలామంది అమ్మలు గుర్తు తెలియని గుబులును మనసులో నింపేసుకుంటున్నారు. వైరాగ్యంలోకి వెళుతున్నారు. శిశు స్వభావాన్ని అర్థం చేసుకోలేక సతమతమవుతున్నారు. అప్పటిదాకా ఆదమరిచి నిద్రపోయిన శిశువు సరిగ్గా ఆమె స్నానానికి వెళ్లగానే గుక్కపట్టి ఏడుస్తుంది. అన్నం తినడానికి కూచుంటే కాలకృత్యాలకు పోతుంది. పగలంతా పడుకుని అమ్మ కనురెప్ప మూతపడే సమయానికి ఆరున్నొక్క రాగం తీస్తుంది. కొత్తలో అమ్మ, అత్త, నానమ్మ, అమ్మమ్మ అందరూ అండగా ఉంటారు. కాని వాళ్లంతా వెళ్లి తల్లీ బిడ్డా మిగిలాక బేబీ కేరింగ్ బాలింతకు వ్యాకులత కలిగిస్తుంది.
బిడ్డ ఏడిస్తే భయం. ఆ బిడ్డను వదిలేసి పారిపోవాలనే కోరిక. నేనొక్కదాన్నే కన్నానా? నాకే ఎందుకు ఇంత పని? పిల్లాడి పనిలో భర్తకు భాగం లేదా? అని మనసులో ఆగ్రహం. తనకు లేని నిద్ర భర్తకు ఎందుకు అనే కసి. ఈ కోపం, బాధ, దిగులు, గుబులు చివరకు ఆత్మహత్య చేసుకోవాలనుకునే నిస్సహాయతకు దారి తీస్తాయి. దానినే ‘బాలింత వ్యాకులత’ (పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్) అంటారు. ఇది ఓ మానసిక రుగ్మత. కాని ఆ సంగతి చాలామంది తల్లులకు తెలియనే తెలియదు. దీనికి వైద్యం ఉంటుందనీ తెలియదు. కొన్నిచోట్లయితే బిడ్డ పడుకుని ఉంటేనే బాగుంది అని నల్లమందు ఇచ్చే అమాయకపు అమ్మలూ ఉన్నారు.
బాలింత వ్యాకులత లేదా పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌కి వర్గవిభేదాల్లేవ్. షైనీ ఆంటోనీ అందుకు చక్కటి ఉదాహరణ. షైనీ ఆంటొనీ.. పేరున్న షార్ట్ స్టోరీ రైటర్. చేతన్ భగత్ నవలలను ఎడిట్ చేసిన సంపాదకురాలు. ఉరకలేసే ఉత్సాహానికి మారుపేరులా ఉండే షైనీ తన తొలి బిడ్డకు జన్మనిచ్చాక ఒక్కసారిగా దిగాలు పడిపోయింది. తన జీవితమే తారుమారైపోయిందనే బెంగపెట్టుకుంది. ఆ రోజులను గుర్తు చేసుకుంటూ ఆమె ఇలా అంటారు-
‘ఇరవై నాలుగు గంటలూ చంటిబిడ్డ బాధ్యతలతో గడపడం వల్ల నిద్ర ఉండేది కాదు. దేనిమీదా ఆసక్తి కలిగేది కాదు. ఆ నిరాసక్తత బిడ్డ మీద ప్రభావం చూపేది. శ్రద్ధ పెట్టలేక పోయేదాన్ని. తొలిసారి తల్లి అయిన అనుభూతిని అనుక్షణం ఆస్వాదించాల్సింది పోయి తల్లి హోదాకే చిరాకు పడే స్థితికి చేరుకున్నాను. విసుగు. తెలియని గుబులు. నిర్లిప్తత! ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉండేది. పిల్ల ఏడుస్తున్నా... అది ‘ఊ.. ఆ’ అంటూ ముచ్చట పెట్టడానికి ప్రయత్నించినా ఎలాంటి ఎక్సైట్మెంట్ ఉండకపోయేది. చుట్టూ అందరూ ఉన్నా ఒంటరిననే ఫీలింగ్. ఉన్నట్టుండి ఏడుపొచ్చేది. మెటర్నిటీ లీవ్ అయిపోయి ఆఫీస్‌కి వెళ్లాక చాలా రిలీఫ్‌గా అనిపించింది. నిజానికి చాలా మంది తల్లులు ఇంట్లో నెలల పసికందును వదిలి ఆఫీస్‌కి వెళ్తుంటే గిల్ట్‌గా ఫీలవుతారు. నేను మాత్రం హ్యాపీగా ఫీలయ్యేదాన్ని. ఎన్ని గంటలైనా ఉత్సాహంగా పనిచేసేదాన్ని. ఇంట్లో చంటిబిడ్డ ఉంది.. ఇంటికి వెళ్లాలి అనే పర్మిషన్ ఏనాడూ అడగలేదు. ఆ ఆఫీసే లేకుంటే ఆ టైమ్‌లోనే నేనేమైపోయేదాన్నో’...
బేర్‌ఫుట్ అండ్ ప్రెగ్నెంట్
షైనీ అనుభవించిన బాధను సైకియాట్రిక్ సొసైటీ
‘పోస్ట్‌పార్టమ్’ డిప్రెషన్ అంటుంది! వినడానికి చిన్న సమస్యలా ఉండొచ్చు. కానీ అనుభవిస్తున్న వారికి అదో నరకం. ఒక్కోసారి ఒళ్లో బిడ్డను చంపేయాలనుకునే విపరీతానికీ ఒడిగట్టొచ్చు. ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో దీని మీదున్న మౌనం వీడింది. దీన్నో ఆరోగ్య సమస్యగా గుర్తించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇక్కడా ఆ నిశ్శబ్దం బద్దలవ్వాలి. తల్లులకు ముఖ్యంగా కొత్త అమ్మలకు ఈ సమస్యకు సంబంధించిన సమాచారాన్నివ్వాలి. సెలైన్స్.. చాలా పరిష్కారాలను పొట్టన పెట్టుకుంటుంది! నోరు విప్పితేనే పరిష్కారం దొరుకుతుంది! అలా సెలైన్స్‌లో సెటిల్ అయిన పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌ని బ్రేక్ చేయడానికి షైనీ ఆంటోనీ ప్రయత్నించింది. తన అనుభవాలను ‘బేర్‌ఫుట్ అండ్ ప్రెగ్నెంట్’ అనే పేరుతో పుస్తకం రాసింది.
కారణాలు
బేబీ బ్లూస్ లేదా పోస్ట్‌పార్టమ్ బ్లూస్‌గా పిలిచే ఈ మానసిక స్థితికి హార్మోన్లదే ప్రధాన పాత్ర అని తేలుస్తున్నాయి కొన్ని అధ్యయనాలు. తల్లిలోని థైరాయిడ్ హార్మోన్ హెచ్చుతగ్గులే పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌కి ముఖ్య కారణమని చెప్తున్నాయి. దీనికి తోడు గర్భవతిగా ఉన్నప్పుడు మాయ (ప్లాసెంటా) విడుదల చేసే స్ట్రెస్ హార్మోన్ కూడా డెలివరీ తర్వాత తల్లిలో డిప్రెషన్‌ని పెంచుతోందిట. అంతేకాదు.. గర్భవతిలో హెచ్చుస్థాయిలో పెరిగిన ఫీమేల్ హార్మోన్స్ డెలివరీ తర్వాత అత్యంత వేగంగా పడిపోవడమూ పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌కి మరోకారణం అని భావిస్తున్నారు మానసిక వైద్యులు.
ఎప్పుడు.. ఏంటి.. ఎలా?
బిడ్డ పుట్టిన నెల నుంచి యేడాది తర్వాత వరకు ఎప్పుడైనా తల్లులు దీని బారిన పడే ప్రమాదం ఉంది. ‘టీన్స్‌లో తల్లులైన వాళ్లు, కుటుంబంలో డిప్రెషన్ హిస్టరీ ఉన్న వాళ్లు, ఫ్యామిలీ సపోర్ట్ లేనివాళ్లు, భర్తతో కలహాల కాపురం చేస్తున్న వాళ్లకు రిస్క్ ఎక్కువ’ అని చెప్తున్నారు బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో సైకియాట్రిస్ట్ అండ్ న్యూరోసైంటిస్ట్గా పనిచేస్తున్న డాక్టర నరేన్రావు.
తల్లి పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ వల్ల బిడ్డ మానసిక స్థితి మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. చివరకు వైవాహిక బంధమూ విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంటుంది. మాత్రలు.. కౌన్సెలింగ్ ద్వారా కొంత ఫలితం ఉంటుంది. అలాగే యోగా, ధ్యానం వల్ల కూడా అని చెప్తున్నారు నిపుణులు. ఎలాంటి వైద్యసహాయం పొందకుండా పోస్ట్‌నాటల్ డిప్రెషన్‌తో బాధపడుతున్న స్త్రీలు.. 49 శాతం మంది ఉన్నారని లెక్కలు చెప్తున్నాయి. ప్రెగ్నెన్సీ సమయంలో వ్యాకులతతో ఆత్మహత్య ఆలోచనలు చేస్తున్న వాళ్లు 38 శాతమట!
- సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
అవగాహన కావాలి..
కాన్పు తర్వాత తల్లులు ఎదుర్కొనే మానసిక సమస్యలపై ఇతర దేశాల్లో కంటే మన దగ్గర అవగాహన తక్కువనే చెప్పాలి. కాన్పు కారణంగా తల్లుల మానసిక పరిస్థితిలో మార్పు వస్తుంది. కోపం, వ్యాకులత, బాధ లాంటి భావాలు ఎక్కువ అవడంతో వారి ప్రవర్తన వింతగా ఉంటుంది. వాటి బారిన పడకుండా మన ఆడబిడ్డల్ని కాపాడుకోవాలంటే ప్రేమ పూర్వక ఇంటి వాతావరణం ఎంతో దోహద పడుతుంది. అలాంటి కేసుల్లో రెండు వారాలకే తల్లులకు ఈ మానసిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. భర్త, అమ్మానాన్నలు, అత్తామామల నుంచి వారు పొందే ప్రేమ, అభిమానంతోనూ ఆ వ్యాకులత తగ్గే అవకాశం ఉంటుంది. కొన్ని కేసుల్లో అంతా బాగున్నా సరే తల్లులు పోస్పార్టమ్ బ్లూస్ బారిన పడొచ్చు.
అప్పుడు వెంటనే వారిని డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పిస్తే మంచి ఫలితం ఉంటుంది. మన దేశంలో ఇప్పటికీ 60 శాతం నుంచి 70 శాతం మంది తల్లులకు దీనిపై అవగాహన లేక మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. పశ్చిమ దేశాల్లో లాగే మన దగ్గరా చికిత్స, కౌన్సెలింగ్ కేంద్రాలున్నాయి. కానీ ఇక్కడ డాక్టర్లకంటే పేషంట్లు ఎక్కువ. పైగా మన దగ్గర దురదృష్టకర పరిస్థితి ఏంటంటే తల్లుల్లో పోస్ట్‌పార్టమ్ బ్లూస్ లక్షణాలు తీవ్రమయ్యాకే వాళ్లను మా దగ్గరకు తీసుకొస్తారు. అలా కాకుండా ముందు నుంచీ దీని మీద ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తే ఇలాంటి సమస్యలను త్వరగా పరిష్కరించుకోవచ్చు.
- డాక్టర్ శ్రీనివాస్ ఎస్‌ఆర్‌ఆర్‌వై,
సైకియాట్రిస్ట్, ప్రభుత్వ మానసిక చికిత్సాలయం, హైదరాబాద్