ఆయుర్వేదం,హోమియోపతికి పెరుగుతున్న ఆదరణ
సికింద్రాబాద్, న్యూస్‌లైన్: దేశంలో ప్రస్తుతం ఆయుర్వేద, హోమియోపతి వైద్యానికి ఎంతో ఆదరణ లభిస్తోందని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సికింద్రాబాద్ ఎస్డీరోడ్ భువన టవర్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన స్టార్ ఆయుర్వేద,హోమియోపతి ఇంటిగ్రేటెడ్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్‌ను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులతో పాటు కీళ్లనొప్పులు, థైరాయిడ్, ఆస్తమా లాంటి వ్యాధులకు ఇందులో చక్కని పరిష్కారం లభిస్తుందన్నారు.
ఆయుర్వేద వైద్యం ఇప్పట్నుంచే కాదని..దేశంలో ఐదువేల ఏళ్ల కింద నుంచి వస్తున్న సంప్రదాయ వైద్యమన్నారు. ఆస్పత్రి సీఎండీ మురళి అంకిరెడ్డి, డెరైక్టర్లు డాక్టర్ శ్రీనివాస్‌గుప్త, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ రవీందర్‌రెడ్డిలు మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో సూపర్ స్పెషాలిటీ సేవలను అడ్వాన్స్డ్ ఆయుర్వేద,హోమియోపతి మందుల ద్వారా దీర్ఘకాలిక,మొండి వ్యాధులను నయం చేస్తున్నట్లు చెప్పారు.
నగరంలో కొత్తపేట, కూకట్పల్లి, సికింద్రాబాద్‌లతోపాటు విజయవాడ,విశాఖపట్టణం, తిరుపతి,రాజమండ్రి, బెంగళూరు, మల్లేశ్వరం, ఇతర రాష్ట్రాల్లో తమ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తుందని చెప్పారు. ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని బ్రాంచీల్లో ఉచిత కన్సల్టెన్సీతోపాటు మందులపై 30శాతం తగ్గింపు ధరలకు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, టీజేఏసీ నాయకులు విఠల్ పాల్గొన్నారు.