నీవు లేకున్నా..నీ జ్ఞాపకాలు పదిలం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:రాజకీయంగా ఓటమి లేని నేతగా, పాలన, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి విశేషంగా కృషిచేశారు. జిల్లాపై ప్రత్యేక మమకారంతో విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో అధిక ప్రాధాన్యమిచ్చారు. నేడు ఆయన 65వ జయంతి సందర్భంగా ఆయన చేసిన అభివృద్ధి పనులను, ఆయన మనస్తత్వం, ఆయన పాలనను సిక్కోలు ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.
అన్నదాతకు భరోసా...
వై.ఎస్.రాజశేఖరరెడ్డి అన్నదాతకు భరోసాగా ఉండేవారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్ అందించే ఫైల్‌పై సంతకం చేసిన ఆయన, ప్రకృతి విపత్తులతో పంటలు కోల్పోరుున అన్నదాతను ఆదుకునేందుకు రుణాలు మాఫీ చేశారు. పంటలకు ప్రధాన ఆధారమైన సాగునీరు అందించేందుకు జలయజ్ఞం చేపట్టి జిల్లాలో ఎన్నో ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఎరువులు, విత్తనాలు, విద్యుత్ సరఫరాతో పాటు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించారు. ఆయన హయాంలోనే 80కిలోల ధాన్యం బస్తా రూ.1380 వరకూ పలికిందన్నది జగమెరిగిన సత్యం. జలయజ్ఞంలో భాగంగా సుమారు రెండులక్షల ఎకరాలకు నీరందించే వంశధార ప్రాజెక్టు రెండో దశ పనులు రూ.733కోట్లతో చేపట్టారు. ఆయన మరణానంతరం పనుల్లో జాప్యం నెలకొంది. తోటపల్లి రిజర్వాయర్ కాలువల విస్తరణ, ఆఫ్‌షోర్ ప్రాజెక్టు, వరద ముప్పు రాకుండా కరకట్టల నిర్మాణం, పరిశ్రమల స్థాపనకు మౌలిక సదుపాయాలు, ఉద్దానం కొబ్బరి, మంచినీటి ప్రాజెక్టులకు అధిక నిధుల కేటారుుంపు తదితర పనులన్నీ ఆయన హయూంలోనే.
విద్యావైద్య రంగాలకు పెద్దపీట
అత్యంత వెనుకబడిన జిల్లాకు వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చినది వైఎస్సారే. గ్రామీణ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలుగా డా.బీఆర్ అంబేద్కర్ పీజీ సెంటర్‌ను యూనివర్సిటీగా స్థాయి పెంచారు. సౌకర్యాల కల్పనకు నిధులు కేటాయించారు. అలాగే, 108, 104 సేవలు, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు వడ్డీలేని రుణాలు, డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ రుణాలు తదితర ప్రజా సం క్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి అన్నివర్గాల ప్రజల గుండెల్లో చోటు సంపాదించారు.
ఇచ్ఛాపురం కాదు ఇష్టాపురం
జిల్లా శివారున ఉన్న ఇచ్ఛాపురం అంటే వైఎస్సార్‌కు ఎంతో ఇష్టం. ఏ కార్యక్రమాన్ని అయినా రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ప్రారంభించి ఇటు ఇచ్ఛాపురంలో ముగించేవారు. కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజల్ని అన్ని విధాల ఓదార్చేందుకు ఆయన చేపట్టిన మహాప్రస్థానం 2003లో ఇచ్ఛాపురంలోనే ముగిసింది. అందుకు గుర్తుగా అక్కడో స్థూపం కూడా వెలిసింది.