క్షుద్రదేవత పీడకలకు అక్షరరూపం
కేశవరెడ్డి తన నవలల్లో సమాజం అట్టడుగు పొరలలో, దాని అంచులలో ఉన్న అణగారిన బతుకుల జీవిత చిత్రణకు అగ్రాసనం వేశారు. స్వానుభవం నుంచి వచ్చినవే ఉత్తమ రచనలనీ, అలాంటివే విశ్వసనీయంగా ఉంటాయనీ ఇటీవల వ్యాప్తిలోకి వచ్చిన భావనను కేశవరెడ్డి నవలలు పూర్వపక్షం చేశాయి.
మున్నెన్నడూ తెలుగు పాఠ కలోకం చవిచూడని నవలలు రాసి, ప్రపంచ సాహిత్యం చది వినపుడు కలిగే అనుభవాన్నీ, అనుభూతినీ ఇచ్చిన రచయిత డాక్టర్ కె. కేశవరెడ్డి. చిత్తూరు జిల్లా, తలుపులపల్లి అనే మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన కేశవరెడ్డి చిన్ననాడే వలసమార్గం (‘రాముడుండాడు, రాజ్యముండాది’లో బీదాబిక్కీ వలె) పట్టారు. పుదుచ్చేరిలో వైద్యశాస్త్రం చదు వుకుని, అక్కడ నుంచి నిజామాబాద్ జిల్లా, డిచ్పల్లి చేరారు. అక్కడే విక్టోరియా మిషనరీ ఆస్పత్రిలో కుష్టు వ్యాధి నిపుణునిగా పనిచేసి, స్థిరపడ్డారు. ఒకవైపు నిత్యం కుష్టువ్యాధిగ్రస్తులకు సేవచేస్తూనే, మరోవైపు కులం అనే కుష్టువ్యాధి సోకిన తెలుగు/భారతీయ సమాజాన్ని అధ్య యనం చేశారు. ఆ సమాజంలోని వైరుధ్యాలను ఔపో శన పట్టారు. దానితో వచ్చిన ఆలోచనలను, భావాలను చిత్రికపట్టగా వచ్చినవే కేశవరెడ్డి నవలలు. వృత్తి రీత్యా కేశవరెడ్డి జీవితమంతా ఉత్తర తెలంగాణలోనే గడిచింది. అయినా, ఆయన నవలల నేపథ్యం చిత్తూరు జిల్లానే.
తెలుగు నవల, కథానిక సాహిత్యం ప్రధానంగా బ్రాహ్మణీయ, విద్యాధిక, పట్టణ, పురుషాధిక్య, మధ్య తరగతి జీవితాలలోని ఈతిబాధలకు పరిమితమైన సం గతి తెలిసిందే. ఇందుకు భిన్నంగా కేశవరెడ్డి తన నవ లల్లో సమాజం అట్టడుగు పొరలలో, దాని అంచులలో ఉన్న అణగారిన బతుకుల జీవిత చిత్రణకు అగ్రాసనం వేశారు. స్వానుభవం నుంచి వచ్చినవే ఉత్తమ రచనలనీ, అలాంటివే విశ్వసనీయంగా ఉంటాయనీ ఇటీవల వ్యాప్తిలోకి వచ్చిన భావనను కేశవరెడ్డి నవలలు పూర్వపక్షం చేశాయి. ఆయన వ్యవసాయ, మధ్య తరగతి కుటుం బం నుంచి వచ్చారు.
కాబట్టి అధో జగత్ సహోదరుల బతుకులలోని నీలి నీడలను స్వయంగా అనుభవించి పల వరించే అవకాశం లేదు. కానీ ఈ రచ యిత తన పంచేంద్రియాలను యాం టెన్నాలుగా మార్చుకుని ఉన్న చోట ఉంటూనే, తనకు అందనంత దూరం లో ఉన్న మాల మాదిగ, యానాది ఇత్యాది పంచముల అనుభవాలనూ, జ్ఞానాన్నీ సొంతం చేసుకోగలిగారు. దీని ఫలితంగానే ‘ఇంక్రెడి బుల్ గాడెస్’ మొదలుకొని ‘మునెమ్మ’ వరకు 8 నవలలు ఆయన కలం నుంచి జాలువారాయి. మన వ్యవస్థలో కులం పోషించే ప్రతి నాయక పాత్రను కేశవరెడ్డి ‘ఇంక్రె డిబుల్ గాడెస్’లో చిత్రించారు.
ఈ నవలలన్నింటిలోను పాఠకులకు ప్రధానంగా కనిపించేది దర్శనాత్మక వాస్తవికతే. ఘర్షణ లేని వాస్తవం ఉండజాలదన్న ప్రాథమిక స్పృహ కేశవరెడ్డి సాహిత్య మంతటా విస్తరించి ఉంటుంది. ఆయన నవలా ప్రస్థా నంలో రెండు పర్యాయాలు సీక్వెల్స్ (కొనసాగింపు నవ లలు) రాయడం గమనిస్తాం. ‘ఇంక్రెడిబుల్ గాడెస్’ నవ లకు ‘స్మశానం దున్నేరు’; ‘మూగవాని పిల్లనగ్రోవి’ నవ లకు ‘చివరి గుడిసె’ అలాంటి కొనసాగింపు నవలలే. మొదటి నవలలో ఉద్భవించిన వైరుధ్యానికి రెండో నవ లలో శత్రు సంహారం ద్వారా ముగింపు పలుకుతా రాయన.
మొదటి సందర్భంలో కథానాయకుని చేతిలో భూస్వామి హతమైతే, రెండో సందర్భంలో బైరాగి ఉసిగొలపడం వల్ల కుక్క భూస్వా మిని కడతేరుస్తుంది. కేశవరెడ్డి సృష్టిం చిన పాత్రలన్నీ ప్రాకృతికంగా నడుచు కున్నట్టు కనిపిస్తూ ఉంటాయి. అదే ప్రకృతి ధర్మం అన్నంత సహజంగా అవి వ్యవహరించడం విశేషం. ఆ పాత్రలను ఒక అనివార్యత, ఒక అనుల్లంఘనీయత ముందుకు తోస్తూ ఉంటాయి. చివరి నవల ‘మునెమ్మ’ లో ఇది మరింత ప్రస్ఫుటం. కథా నాయిక మునెమ్మ తన భర్తను చంపిన వారిని బొల్లెద్దుతో చంపిస్తుంది. అం టే ఆయన పాత్రలన్నీ తమ తమ కర్తవ్యాన్ని నెరవేర్చడం దగ్గర ఒక దీక్షతో, నిబద్ధతతో సాగుతూ ఉంటాయి.
ఒక అమానుష, భయంకర, చీకటి కమ్మిన వాస్తవికతతో కూడిన బీభత్స వాతావరణం కేశవరెడ్డి నవలలన్నింటి లోనూ కనిపిస్తూ ఉంటుంది. ఆయన సృష్టించిన పాత్ర లన్నీ ఒక పోరాట స్ఫూర్తితో కదలాడుతూ ఉంటాయి. ఇంతకీ ఆ పోరాట స్ఫూర్తి చుట్టూ ఉన్న పరిస్థితుల మీద తిరగబడేందుకు సంతరించుకున్నదే. ఆయన నవలలు ఇచ్చే సందేశం కూడా అదే.
ఈ ఆవిష్కరణలోనే కేశవరెడ్డి కవితాత్మక న్యాయా న్ని కూడా సాధిస్తారు. హెన్రీ మిల్లర్ (సుప్రసిద్ధ అమె రికన్ నవలాకర్త) అమెరికాను ‘ఎయిర్ కండిషన్డ్ నైట్ మేర్ ’ అని అభివర్ణిస్తాడు. కేశవరెడ్డి భారతీయ సమా జాన్ని ‘క్షుద్రదేవత దుస్స్వప్నం’గా అభివర్ణించడం కూడా అలాంటిదే.
(వ్యాసకర్త ప్రముఖ సాహిత్య విమర్శకులు)
మొబైల్: 8790908538