చిన్న పట్టణాల్లో పీఓఎస్ క్యాష్ విత్‌డ్రా పరిమితి రెట్టింపు
న్యూఢిల్లీ: చిన్న, మధ్య స్థాయి పట్టణాల్లో (టైర్ 3, 4 సెంటర్లు) అమ్మకం కేంద్రాల (పాయింట్ ఆఫ్ సేల్స్) వద్ద విత్ డ్రా చేసుకునే నగదు పరిమితిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెట్టింపు చేసింది. దీనితో ఈ పరిమితి రూ.1,000 నుంచి రూ.2,000కు పెరిగింది. కస్టమర్లకు సౌలభ్యంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. బ్యాంకులు జారీ చేసే డెబిట్ కార్డులు, ఓపెన్ సిస్టమ్ (ఏ అవసరానికైనా వినియోగించుకునే) ప్రీపెయిడ్ కార్డులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. కాగా పెద్ద పట్టణాల్లో (టైర్ 1,2 సెంటర్లు) నగదు విత్‌డ్రాయల్ పరిమితిని మాత్రం రూ.1,000గానే కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
ఈ-పేమెంట్ల వ్యవస్థలో ఇదొక ముందడుగని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా పీఓఎస్‌ల వద్ద విత్డ్రాయల్స్పై చార్జీలకు సంబంధించి ఆర్బీఐ కీలక ఆదేశాలిచ్చింది. లావాదేవీ మొత్తంపై ఒక శాతానికి మించకుండా కస్టమర్ చార్జీలను అన్ని కేంద్రాల్లో అమలు చేయవచ్చని సూచించింది. నగదు విత్‌డ్రాయల్ సౌలభ్యత ఉన్న అన్ని పీఓఎస్‌ల వద్ద ఆయా అంశాలను సూచిస్తూ... డిస్ప్లే బోర్డ్ తప్పనిసరిగా ఉంచాలని ఆర్బీఐ పేర్కొంది. కొనుగోలుదారులైనా కాకపోయినా... పీఓఎస్‌ల వద్ద కార్డ్హోల్డర్లు అందరూ నగదు విత్‌డ్రాయెల్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. దీనికోసం కస్టమర్లు ఏటీఎంలలో విత్‌డ్రాయల్స్ తరహాలోనే పీఓఎస్‌ల వద్ద తమ కార్డులను స్వైప్ చేసి, పిన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. 2009 జూలైలో పీఓఎస్ టెర్మినళ్ల వద్ద డెబిట్ కార్డుల నగదు విత్‌డ్రాయల్‌కు అనుమతినిచ్చింది. 2013 సెప్టెంబర్‌లో బ్యాంకులు జారీ చేసిన ప్రీ-పెయిడ్ కార్డులకు కూడా దీనిని వర్తింపజేసింది.