డ్రెడ్జింగ్ హార్బర్ నిర్మాణానికి త్వరలో టెండర్లు
ఎమ్మెల్యే గొల్లపల్లి
అంతర్వేది (సఖినేటిపల్లి) :
అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మొదటి విడతగా రూ.850 కోట్లతో త్వరలో టెండర్లు పిలవనున్నదని రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు తెలిపారు. కోస్టల్ ఇండియా డెవలప్మెంట్ చైర్మన్ జీవీఆర్ శాస్త్రి, మలేషియా ప్రతినిధుల బృందం, జీఎమ్మార్ గ్రూపు ప్రతినిధులతో కలిసి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అటు డ్రెడ్జింగ్, ఇటు ఫిషింగ్ హార్బర్లతో అంతర్వేది పారిశ్రామిక హబ్‌గా రూపు దిద్దుకోనున్నదని చెప్పారు. డ్రెడ్జింగ్ హార్బర్‌పై అడిగిన ప్రశ్నలకు కోస్టల్ ఇండియా డెవలప్మెంట్ చైర్మన్ శాస్త్రి సమాధానాలు దాటవేశారు. అంతర్వేది పారిశ్రామికంగా ఏనాడో అభివృద్ధి చెందాల్సి ఉందని, ఇప్పటికే ఎంతో జాప్యం జరిగిందని అన్నారు.
తాము నిమిత్తమాత్రులమని, పనులన్నింటినీ శ్రీలక్ష్మీ నృసింహస్వామివారే చూసుకుంటున్నారని వేదాంత ధోరణిలో చెప్పారు. జీఎమ్మార్ గ్రూపు ప్రతినిధి రాజు మాట్లాడుతూ, డ్రెడ్జింగ్ హార్బర్‌కు అనుబంధంగా మరికొన్ని పరిశ్రమలు రానున్నాయని, విశాలమైన రోడ్లు వస్తాయని చెప్పారు. ఆలయం వద్ద వారికి ప్రధాన అర్చకుడు కిరణ్, స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేద పండితులు చింతా వేంకటశాస్త్రి, అర్చకులు, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ చిక్కాల వెంకట్రావు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మలేషియాకు చెందిన డేటో పీటర్ టేన్ పొయిటెల్, డేటన్కింకో తదితరులు, జీఎమ్మార్ ప్రతినిధులు నితిన్ అగర్వాల్, బీవీఎన్ రావు, రాజు ఉన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరి డెల్టా కమిటీ చైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజువర్మ తదితరులు పాల్గొన్నారు.
హార్బర్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన విదేశీ ప్రతినిధులు
కరవాక (మామిడికుదురు) : సముద్ర తీరంలోని కరవాక గ్రామంలో రూ. 500 కోట్లతో ప్రైవేటు రంగంలో హార్బర్ నిర్మించనున్న స్థలాన్ని విదేశీ ప్రతినిధుల బృందం శుక్రవారం పరిశీలించింది. రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యాన సెంట్రల్ కోస్టల్ అథారిటీ చైర్మన్ శాస్త్రి, మలేషియా, కొరియా దేశాలకు చెందిన ప్రతినిధుల బృందం తీరంలో పర్యటించింది. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ 500 ఎకరాల విస్తీర్ణంలో ప్రైవేటు హార్బర్ నిర్మిస్తామన్నారు. హార్బర్ నిర్మాణానికి ఇక్కడి పరిస్థితులు అనువుగా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ భూమి 240 ఎకరాలు, సొసైటీ భూమి 260 ఎకరాలు దీనికోసం సేకరిస్తామన్నారు. ఎమ్మెల్యే సూర్యారావు మాట్లాడుతూ, హార్బర్ నిర్మాణం ద్వారా తీరప్రాంత మత్స్యకారులకు ఎంతో ప్రయోజనం కలగడంతోపాటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు.