డ్రెస్‌కోడ్.. గ్రాండ్‌లుక్
అందంగా.. అనుకూలంగా..
వ్యాపారసంస్థల్లో యూనిఫాం ట్రెండ్
సిబ్బందిని గుర్తుపట్టడం సులభం
కరీంనగర్ బిజినెస్ : షాపింగ్‌మాల్స్‌కు వెళ్తే.. వినియోగదారులు ఎవరూ.. షాప్ బాయ్స్ ఎవరూ అని ఆరా తీయకుండానే ఈజీగా గుర్తుపట్టొచ్చు. ఎలాగంటారా..! అరే అదేనండి డ్రెస్‌కోడ్. నగరంలోని పలు వ్యాపార సంస్థలు తమ సిబ్బందికి తప్పనిసరిగా యూనిఫామ్స్ అందిస్తున్నాయి. గ్రాండ్‌లుక్ రావడంతోపాటు గుర్తుపట్టడం వినియోగదారులకు సులభమవుతుంది.
మహానగరాలకే పరిమితమైన డ్రెస్‌కోడ్ ఇప్పుడు నగరంలోనూ విస్తరిస్తుంది. వస్త్రదుకాణాలు, బంగారు ఆభరణాల దుకాణాలు, కార్ల షోరూంలతోపాటు పలు వాణిజ్య సంస్థలు అదిరేటి డ్రెస్‌లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. నగరంలో వస్త్ర, బంగారు దుకాణాలు, షాపింగ్‌మాల్స్ నూతనంగా వెలుస్తున్నాయి. కరీంనగర్ కొత్త పుంతలు తొక్కుతూ వ్యాపార, వాణిజ్య రంగాల్లో ముందుకు దూసుకుపోతోంది. వ్యాపారసంస్థలు సిబ్బందికి డ్రెస్‌కోడ్ అమలు చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. నగరంలో డ్రెస్‌కోడ్ అమలు చేస్తున్న వాటిలో బట్టల దుకాణాలు, మోటార్, కార్ల షోరూంలు, బంగారు దుకాణాలు, మొబైల్ దుకాణాలు చేరాయి.
సంస్థలకు గుర్తింపు
ఒక సంస్థలో పనిచేసే సిబ్బంది యూనిఫాం వేసుకోవడం ద్వారా క్రమశిక్షణ అలవడడంతోపాటు వినియోగదారులను ఆకట్టుకోవచ్చనే మూల సూత్రం. ఇదేకాకుండా కార్పొరేట్ సంస్థలు, బడా కంపెనీలు, పరిశ్రమల్లో ఎక్కువ మంది పనిచేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కోసారి యజమాని తన వద్ద పనిచేసే సిబ్బందిని గుర్తించడం కష్టతరమవుతుంది. సిబ్బందికి ప్రత్యేక డ్రెస్‌కోడ్ ద్వారా ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
యూనిఫాం ఉద్దేశం
జడ్జి నుంచి న్యాయవాదులు నల్లటి కోటుతో కనిపిస్తుంటారు...పోలీసు విభాగంలో ఉన్నతాధికారి నుంచి చిరుద్యోగి వరకు ఖాకీ వస్త్రాలే «ధరిస్తారు. ఆస్పత్రిలో సీనియర్ వైద్యుల నుంచి నర్సుల వరకు తెల్లటి ఆఫ్రాన్ వేసుకుంటున్నారు. ఒక సంస్థలో పనిచేసే సిబ్బంది.. ఒకే స్కూల్లో చదివే విద్యార్థుల మధ్య ధనిక, పేద తారతమ్యం ఉండకూడదనేది యూనిఫాం ఉద్దేశం.
క్యాటరింగ్‌కు సైతం
విద్యార్థులు, కొన్ని ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన యూనిఫాం పద్దతి ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు తప్పనిసరిగా మారింది. స్టార్ హోటల్లో ఫుడ్ ఆర్డర్ తీసుకునే వారి నుంచి సప్లయ్ చేసే వ్యక్తికి, బట్టల షోరూంలో సేల్స్‌మెన్, జ్యువెల్లరీషాప్లో స్టాప్, పెళ్లిళ్లలో క్యాటరింగ్సిబ్బంది, వాహన షోరూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, మెకానిక్, పెట్రోల్‌బంక్ సిబ్బంది, పెళ్లి ఊరేగింపులలో బ్యాండ్ వాయించేవారు, ఇలా ప్రతిచోట డ్రెస్‌కోడ్ ద్వారా ప్రత్యేకను చాటుకుంటున్నారు.