ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను!
డ్రెస్సింగ్ రూమ్ రివ్యూ వివాదంలో స్మిత్‌కు సహ భాగస్వామిగా ఉన్న హ్యాండ్స్కోంబ్ మరో సారి తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. ‘నేను నా అంతర్జాతీయ కెరీర్ ఆరంభ దశలో ఉన్నాను. డీఆర్ఎస్తో ఇప్పటి వరకు పెద్దగా పని పడలేదు. దానిని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాను. అలా చేయకూడదని నాకు అస్సలు తెలీదు. ఈ ఘటనతో తెలిసొచ్చింది. దీనిని ఇక్కడితో ముగించి ముందుకు సాగాలని కోరుకుంటున్నా’ అని అతను ట్వీట్ చేశాడు. మరో వైపు మైదానంలోనుంచి స్మిత్ చేసిన సైగ స్వయంగా తాము కూడా నిర్ఘాంతపోయేలా చేసిందని ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ డేవిడ్ సాకెర్ వ్యాఖ్యానించారు.
‘స్మిత్ అలా అడిగినప్పుడు మేమందరం షాక్‌కు గురయ్యాం. ఎందుకంటే గతంలో ఎప్పుడూ ఇలా చూడలేదు. అందుకే చాలా ఆశ్చర్యం కూడా కలిగింది. అయితే అంతకు ముందు కూడా మేం ఇలా చేశామనే ఆరోపణను మాత్రం ఖండిస్తున్నా’ అని సాకెర్ అన్నారు. మరో వైపు భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ కూడా స్మిత్‌పై చర్య తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు. ఐసీసీ ఒక్కో దేశం పట్ల ఒక్కో రకంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
‘మూడో టెస్టులో ఒక వేళ కోహ్లి కూడా అవుటై రివ్యూ కోరాల్సి వస్తే... అదే తరహాలో డ్రెస్సింగ్ రూమ్ వైపు చూసి సైగ చేయాలని కోరుకుంటున్నా. ఒక భారత ఆటగాడు అలా చేస్తే ఇప్పుడు స్మిత్‌కు మద్దతిస్తున్నవారి స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరం. అప్పుడు ఐసీసీ, మ్యాచ్ రిఫరీ ఏం చేస్తారో చూడాలి’ అని సన్నీ అన్నారు.