రోడ్డెక్కిన రైతన్న
మాచవరం/దాచేపల్లి: దిగుబడి చేతికొచ్చే దశలో ప్రభుత్వం సాగునీరు నిలిపివేయడంతో పంటలు ఎండుముఖం పట్టాయి. చివరి భూములకు నీరు అందక మాగాణులు సైతం బీటలు వారుతున్నాయి. ఇప్పటి వరకు అరకొరగా అందుతున్న నీటిని సైతం ఆపివేయడంతో అన్నదాతలు ఆందోళనకు దిగారు. ఖరీఫ్‌లో అకాల వర్షాలు కారణంగా పంట నష్టపోయిన రబీలోనైనా ఆ నష్టాన్ని పూడ్చుకుందామని వరి సాగుచేస్తే నీరివ్వకుండా ప్రభుత్వం తమతో చెలగాటమాడుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. తంగెడ మేజర్ కాలువకు తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దాచేపల్లికి చెందిన రైతులు శనివారం ధర్నా చేపట్టారు. అద్దంకి-నార్కెట్‌పల్లి హైవేపై అరగంటపాటు రాస్తారోకో చేశారు. అనంతరం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు.
తంగెడ మేజర్ కాలువలో నీరు నిలిపివేయటం వలన మిరప పంటలు ఎండిపోతున్నాయని, పంట చేతికి వచ్చే సమయంలో నీటితడి వేయకపోవటం సాగు భూమి నెర్రెలిస్తోందని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే దిగుబడి పూర్తిగా తగ్గిపోయి తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించి తంగెడ మేజర్ కాలువకు సాగునీరు విడుదల చేయాలని కోరతూ స్థానిక రెవెన్యూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో రైతులు యర్రంశెట్టి నరసింహస్వామి, కంభంపాటి గురుస్వామి, జాలె సైదారావు, బోమ్మిరెడ్డి ముసలి, కె.నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.
ఆకురాజుపల్లి మేజర్ పరిధిలోనూ..
మాచవరం మండలంలోని మోర్జంపాడు, పిల్లుట్ల, కొత్తపాలెం తదితర గ్రామాల్లో వేసిన వరి పొలాల్లో ఆకురాజుపల్లి మేజర్ కాలువ ద్వారా నీళ్లు అందకపోవడంతో వరి పొలాలు నైచ్చాయి. ఇప్పటివరకు రబీ వరి పంటలకు రైతులు ఎకరాకు సుమారు రూ.15 వేల పెట్టుబడి పెట్టారు. మరో 20 రోజులు నీరు అందిస్తే వరి పంట చేతికొస్తుంది. మిరప పంటలు చివరి దశలో ఉన్నాయి.
ఈ సీజన్లో ఆరుతడులకైనా నీళ్లు చాలా అవసరం. ఈ పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వం అరకొర వచ్చే కాలువ నీళ్లు కూడా ఆపివేయడంతో ఆకురాజుపల్లి మేజర్ కింద సాగులో ఉన్న వరి పంటలు కూడా ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడులకు తెచ్చిన అప్పులు తీర్చే మార్గం కనిపించడం లేదని, తమ పరిస్థితి గమనించి, ప్రభుత్వం కాలువ ద్వారా సాగునీరు అందించాలని రైతులు వేడుకొంటున్నారు.