పాపం పసివాడు
బస్సు చక్రాల కింద నలిగి బాలుడి మృతి
బస్సులోని రంధ్రం నుంచి పడడంతో ఘటన
దైవ దర్శనానికి వచ్చి వెళ్తుండగా ప్రమాదం
{పైవేట్ బస్సు యాజమాన్యం, ఆర్టీసీ నిర్లక్ష్యమే కారణం
యాదగిరిగుట్ట, న్యూస్‌లైన్: అద్దె బస్సు యజమానితో పాటు ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యం ఓ చిన్నారి ఉసురుతీశాయి. బస్సులోని ఫ్లోరింగ్‌పై ఉన్న రంధ్రంలోంచి జారి పడిన ఆ చిన్నారి అదే బస్సు చక్రాల కింద నలిగి ప్రాణం విడిచాడు. ఈ విషాద ఘటన యాదగిరిగుట్ట శివారు గుండ్లపల్లి గ్రామశివారులో బుధవారం జరిగింది. ఎస్ఐ నర్సింహరావు కథనం ప్రకారం... ఉప్పల్ భరత్‌నగర్ కాలనీకి చెందిన శ్రీధర్‌రెడ్డి, సంధ్యారెడ్డి దంపతులకు కుమారుడు సూర్యారెడ్డి (3) సంతానం.
బుధవారం ఉదయం సంధ్యారెడ్డి కుమారుడు సూర్యారెడ్డిని తీసుకుని తన తల్లిదండ్రులతో కలిసి శ్రీలక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు యాదగిరిగుట్టకు వచ్చారు. ఉదయం స్వామి వారిని దర్శించుకుని సాయంత్రం తిరిగి ఉప్పల్‌కు బయలుదేరారు. గుట్ట బస్టాండ్‌లో హైదరాబాద్‌కు వెళ్లే బస్సు (అద్దెబస్సు) ఎక్కారు. బస్సు గుట్ట పట్టణ శివారులోని గుండ్లపల్లి గ్రామానికి చేరుకుంది. ఆ సమయంలో బస్సులో తల్లి పక్కన సూర్యారెడ్డి నిల్చున్నాడు. ఫ్లోరింగ్‌పై ఉన్న రంధ్రాన్ని గమనించలేదు.
ఒక్కసారిగా ఆ రంధ్రం లోంచి జారి కింద పడ్డాడు. వేగంగా కదులుతున్న బస్సుచక్రం కింద బాలుడి తల పడింది. దీంతో తలవెనుకభాగం నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ బస్సును వెంటనే నిలిపివేశాడు. బాలుడి తల్లి సంధ్యారెడ్డి, ఆమె తల్లిదండ్రులు మృతదేహం చిన్నారి మృతదేహంపై పడి గుండెలు బాదుకుంటూ రోదించారు. ప్రమాద దృశ్యాన్ని చూసి చలించిన తోటి ప్రయాణికులు, స్థానికులు కంటతడిపెట్టారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బస్సును, బస్సుడ్రైవర్‌ను స్టేషన్‌కు తరలించారు.
బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. సంఘటన స్థలాన్ని గుట్ట ఆర్టీసీ డీఎం సందర్శించారు. బాధితులకు తక్షణ ఆర్థికసాయం కింద రూ.5వేలు అందిస్తామన్నారు. సంఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు. ప్రైవేట్ బస్సు యజమాని నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు.
ఈ పాపం..ఎవరిది?
బాలుడు మృతికి ప్రైవేట్ బస్సు యాజమాన్యంతో పాటు ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న ఆరోపణలు వస్తున్నాయి. బస్సు నిర్వహణ, ఫిట్నెస్ బాధ్యత బస్సు యజమానిదేనని ఆర్టీసీ అధికారులు చెబుతున్నప్పటికీ ,ప్రైవేట్ బస్సుల సామర్థ్యం.. లోపాలను పరిశీలించిన తర్వాతే బస్సును బయటకు పంపించాల్సిన బాధ్యత ఆర్టీసీపై ఉంది. ఇటు బస్సు యాజమాన్యం, అటు ఆర్టీసీ అధికారులు తమ బాధ్యతలు విస్మరించడంతో పసివాడి ప్రాణం గాలిలో కలిసిపోయింది.