అప్రమత్తత అవసరం
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: బంగాళాఖాతంలో ఏర్పడిన పై-లీన్ తుపాను ప్రభావం జిల్లాపైనా ఉండవచ్చని.. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో ఏజేసీ రామస్వామి, డీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ సూర్యప్రకాష్ తదితరులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ అధికారుల సమాచారం మే రకు జిల్లాపైనా తుపాను ప్రభావం చూ పవచ్చన్నారు. ఎలాంటి పరిస్థితులైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు అధికారులంతా సన్నద్ధం కావాలన్నారు. ముఖ్యంగా నదీ తీర ప్రాంతాల తహశీల్దార్లు, ఎంపీడీఓలు అప్రమత్తం కావాలన్నారు. తుపాను తీరం దాటవచ్చని భావిస్తున్న శనివారం రోజున జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. ఈ విషయంలో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.