జేసీ–2కు అవమానం
కర్నూలు(అగ్రికల్చర్):
జిల్లా జాయింట్ కలెక్టర్ సెలవుల్లో వెళితే సర్వ సాధారణంగా జాయింట్ కలెక్టర్–2కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తారు. కానీ జిల్లాలో జేసీ–2ను పక్కన పెట్టి అవమానపరిచేలా ఇతరులకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమయింది. ఇటీవల జాయింట్ కలెక్టర్ హరికిరణ్ నాలుగు రోజుల పాటు శిక్షణ నిమిత్తం వెళ్లారు. ఆయన తర్వాతి స్థానంలో ఉన్న జేసీ–2 రామస్వామికి బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. ఆయన అందుబాటులో లేకపోతే డీఆర్ఓకు ఇన్చార్జి బాధ్యతలు కట్టబెడతారు. కానీ జిల్లా కలెక్టర్ జేసీ–2ను, డీఆర్ఓను కాదని స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అయిన శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే జేసీ–2కి ప్రాధాన్యత తగ్గించారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జేసీ–2 రామస్వామి విధుల్లోనే అందుబాటులో ఉన్నా.. జూనియర్ అయిన అధికారికి జేసీగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడం పట్ల అసంతప్తి వ్యక్తమవుతోంది. ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంలో జిల్లా కలెక్టర్కు విచక్షణాధికారాలు ఉన్నా సీనియారిటీని గౌరవించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.