తెలంగాణకు కరువు సాయం రూ.791 కోట్లు
న్యూఢిల్లీ: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం భారీ సాయం ప్రకటించింది. కరువు భత్యం కింద రూ.791 కోట్లు విడుదల చేసింది. కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో గురువారం ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జాతీయ విపత్తు సహాయ నిధి(ఎన్డీఆర్ఎఫ్) నుంచి ఈ సహాయాన్ని అందించేందుకు కమిటీ ఆమోదించింది.
ఇప్పటికే కేంద్ర కరువు బృందం తెలంగాణలో పలు ప్రాంతాల్లో స్వయంగా పర్యటించింది. దీనిపై సమగ్ర నివేదికను అధికారుల బృందం కేంద్రానికి సమర్పించింది. ఫలితంగా రూ.791 కోట్లు తెలంగాణకు కేంద్రం మంజూరు చేసింది.
ఈ సమావేశంలో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, రాధా మోహన్ సింగ్, హోం సెక్రటరీ రాజీవ్ మెహర్షితో పాటు హోం, ఆర్ధిక, వ్యవసాయ రంగాల సీనియర్ అధికారులు పాల్గొన్నారు. దాదాపు రూ. 2,500 కోట్ల మేర కరువు సాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. రెండు రోజుల క్రితమే మంత్రి హరీష్రావు కూడా ఢిల్లీలో రాధామోహన్సింగ్ను కలసి కరువు సాయంపై చర్చించిన విషయం తెలిసిందే.