మన షేర్లు ముంచేశాయ్
ఒకప్పుడు భారీ లాభాలందించిన రాష్ట్ర కంపెనీలిపుడు ఇన్వెస్టర్లను నిండా ముంచుతున్నాయి. గడిచిన రెండేళ్లలో సెన్సెక్స్ 1,100 పాయింట్లు లాభపడినా... రాష్ట్ర కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులు మాత్రం ఆవిరైపోయాయి. అతితక్కువ కంపెనీలు తప్ప రాష్ట్రానికి చెందిన దిగ్గజాలు కూడా మదుపరులను ముంచేశాయి. స్టాక్ మార్కెట్లో రాష్ట్ర కంపెనీలు గతంలో ఓ వెలుగు వెలిగాయి. ఫార్మాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ముందంజ వేస్తే... సాఫ్ట్వేర్ రంగంలో సత్యం కంప్యూటర్స్, విజువల్ సాఫ్ట్ వంటివి ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు సృష్టించాయి. ఇక ఇన్ఫ్రా రంగంలోనైతే జీఎంఆర్, జీవీకే, ఐవీఆర్సీఎల్, ల్యాంకో, ఎన్సీసీ వంటివి పోటీపడి కాంట్రాక్ట్‌లను దక్కించుకుంటూ దూసుకెళ్లాయి.
సిమెంట్ రంగంలో కూడా రాశి, సాగర్ సిమెంట్స్, ప్రియా సిమెంట్స్ వంటివి మంచి పనితీరు కనబరిచాయి. దీంతో ఇన్వెస్టర్లు రాష్ర్ట కంపెనీల్లో పెట్టుబడులకు మొగ్గుచూపారు. కానీ నాలుగేళ్లుగా ఈ పరిస్థితులు తారుమారయ్యాయి. గడిచిన రెండేళ్లలో అయితే పరిస్థితులు మరింత అధ్వానంగా మారాయి. ఇందుకు ప్రపంచవ్యాప్తంగా చెలరేగిన ఆర్థిక సంక్షోభం ఒక కారణమైతే... ఆ ప్రభావంతో పెరిగిపోయిన వడ్డీ రేట్లు, యాజమాన్య వైఫల్యాలు, షేర్ల తనఖాలు వంటివి కూడా తోడయ్యాయి. దీంతో షేర్లు కుప్పకూలుతున్నాయి.
ఒకో కంపెనీది ఒకో సమస్య
యాజమాన్య వైఫల్యాలతో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు చరిత్రలో కలిసిపోయాయి. సత్యం... టెక్ మహీంద్రాలో విలీనంకాగా, విజువల్ సాఫ్ట్... మెగా సాఫ్ట్‌లో కలసిపోయింది. దేశ ముఖచిత్రాన్ని మార్చగల ఇన్ఫ్రా కంపెనీలు జీఎంఆర్, జీవీకే, ల్యాంకో, ఐవీఆర్సీఎల్, ఎన్సీసీ భారీ రుణాలతో కుదేలయ్యాయి. ఇక యానిమేషన్ వండర్ డీక్యూ ఎంటర్టైన్మెంట్, రైళ్లు ఢీకొనకుండా చూసే పరికరాలను అభివృద్ధి చేసిన కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్, ఎల్ఈడీ ఉత్పత్తులు మిక్ ఎల క్ట్రానిక్స్, ఖనిజాల జాడకనిపెట్టే సీస్మిక్ సర్వేల్ని విశ్లేషించే అల్ఫాజియో వంటి ప్రత్యేక తరహా కంపెనీలు కూడా సమస్యల్లో పడ్డాయి. రుణ భారంలో ఇరుక్కుపోయిన ఇన్ఫ్రా కంపెనీలు... పోటీపడి దక్కించుకున్న కాంట్రాక్ట్‌లను సైతం వదులుకునే స్థితికి చేరాయి. బ్యాంకింగ్ రంగంలో పెరిగిన మొండిబకాయిల వల్ల ఆంధ్రాబ్యాంక్, ఆతిథ్య రంగ మందగమనం వల్ల తాజ్ జీవీకే హోటల్స్ వంటి సంస్థలు కూడా వెనకబడ్డాయి. ఈ ప్రభావమంతా షేర్లను తాకటంతో ఇన్వెస్టర్ల నెత్తిన పిడుగులు పడుతున్నాయి.
నిలదొక్కుకున్న కంపెనీలూ ఉన్నాయ్...
ఆటుపోట్లను తట్టుకుంటూ కచ్చితమైన భవిష్యత్ వ్యూహాలతో విస్తరిస్తున్న రాష్ట్ర కంపెనీలు కూడా ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్నే తీసుకుంటే... పరిశోధన రంగంలోనూ భారీ పెట్టుబడులు పెడుతూ ముందుకెళుతోంది. దీంతో షేరు ధర కూడా గత రెండేళ్లలో దాదాపు 38% లాభాలను అందించటమే కాక సెన్సెక్స్‌లో మళ్లీ స్థానాన్ని సంపాదించుకుంది. దేశవ్యాప్తంగా విస్తరిస్తూ బిజినెస్‌ను పెంచుకుంటున్న అపోలో హాస్పిటల్స్ షేరు ఈ రెండేళ్లలో 79 శాతం దూసుకెళ్లింది. అంకాలజీ (కేన్సర్ చికిత్స) ఔషధాలలో తన ప్రత్యేకతను చాటుకోవడంతో పాటు చౌక ధరల్లో జనరిక్స్‌ను అందిస్తూ నాట్కో ఫార్మా కూడా నిలదొక్కుకుంది. దీంతో ఈ షేరు ధర రెట్టింపై ఇన్వెస్టర్ల పంట పండించింది. టెలికం రంగానికి అవసరమయ్యే యూపీఎస్ బ్యాటరీలతో మొదలుపెట్టిన అమరరాజా బ్యాటరీస్, తీవ్రమైన పోటీలో కూడా అమరాన్ బ్రాండ్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళుతోంది. నిజానికి పతనమైన రాష్ట్ర కంపెనీలతో పోలిస్తే ఇన్వెస్టర్లకు లాభాలిచ్చినవి అతితక్కువే కావచ్చు. కానీ ఫండమెంటల్స్ బలంగా ఉన్న కంపెనీలు ఏ పరిస్థితిలోనైనా దూసుకెళతాయని మాత్రం ఇవి చెబుతున్నాయి.
- సాక్షి, బిజినెస్ డెస్క్