అతిసార కేసులు లేవు
► వ్యక్తిగత పరిశుభ్రత లోపమే అస్వస్థతకు కారణం
► జిల్లా అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ శశాంక్
జోగిపేట(అందోలు): అతిసార కేసులు లేవని జిల్లా అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ శశాంక్ చెప్పారు. జోగిపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 65 మంది అతిసారంతో చికిత్స పొందుతున్నట్లు వచ్చిన ఓ దినపత్రిక(సాక్షికాదు)లో ప్రచురితమైన కథనానికి జిల్లా వైద్యశాఖ అధికారులు స్పందించారు. ఆదివారం ఆసుపత్రిని సందర్శించారు. జిల్లా అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ శశాంక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరిశీలించారు. రోగులు ఎక్కడెక్కడి నుంచి వచ్చారని సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణను ప్రశ్నించారు.
అక్కడ ఇద్దరు... ఇక్కడ ఒకరు అంటూ 9 మందిని చూపించారు. 65 మంది ఎక్కడ ఉన్నారని సూపరింటెండెంట్‌ను ప్రశ్నించారు. ఒక్కో సెలైన్ బాటిల్ ఎక్కించుకొని వెళ్లిపోతున్నారని డాక్టర్ చెప్పడంతో అడిషనల్ డీఎంహెచ్ఓ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒకే గ్రామానికి చెందినవారు ఎంత మంది ఉన్నారని ఆరా తీశారు. 24 గ్రామాలకు చెందినవారు ఒకరిద్దరు చొప్పున ఉన్నారని డాక్టర్ అధికారికి వివరించారు. అనంతరం జిల్లా అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ శశాంక్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఇందులో అతిసారం కేసులు ఏమీ లేవన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత లోపించడంతో అస్వస్థతకు గురవుతున్నారని స్పష్టం చేశారు. అతిసారం అదుపులోకి తెచ్చేందుకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. తాలెల్మ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ నృపేన్ చక్రవర్తి, హెచ్ఈఓ విజయ్‌కుమార్, సిబ్బంది నర్సింలు, శంకర్లు ఆయన వెంట ఉన్నారు.