'5వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల'
హైదరాబాద్: ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లుపై తమ ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఆలోచిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం హైదరాబాద్‌లో తెలిపారు. వీలైతే ఆ బిల్లు ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెడతామన్నారు. ఈ ఏడాది డీఎస్పీ, టెట్ ఒకే రోజు నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి ఏటా ఇలాగే నిర్వహిస్తామని తెలిపారు. టెట్ రద్దుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.
సెప్టెంబర్ 6వ తేదీ తర్వాత తమిళనాడు విద్యా విధానాన్ని పరిశీలించడానికి అధ్యయన కమిటీ వెళ్తుందని పేర్కొన్నారు. ఎంసెట్‌పై కూడా ఏపీ ప్రభుత్వం అధ్యయనం చేస్తుందని తెలిపారు. సెప్టెంబర్ 3న ఢిల్లీలో అన్ని రాష్ట్రాల విద్యాశాఖ అధికారుల సమావేశంలో పాల్గొంటామన్నారు. సెప్టెంబర్ 5న విజయవాడలో టీచర్స్ డే నిర్వహిస్తామన్నారు. ఆ రోజే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.