ఆర్టీఏలో నిబంధనలు హుష్కాకి!
యూనిట్ కేంద్రాల్లో తిష్టవేసిన ఉద్యోగులు బదిలీ వద్దంటూ పైరవీలు అసంతృప్తిలో డీటీసీ ఆఫీసు సిబ్బంది తిమ్మాపూర్, ప్రాంతీయ రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయంలో నిబంధనలు అమలు కావడం లేదు. ఉద్యోగుల బదిలీల విషయంలో అధికారులు సైతం వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
యూనిట్ కేంద్రాల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయకపోవడమే దీనికి నిదర్శనంగా చూపుతున్నారు. డీటీసీ కార్యాలయంలో సాధారణంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది. అయితే ఇక్కడ పనిచేస్తున్న సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు యూనిట్ కేంద్రాలకు బదిలీ కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పాతుకుపోతున్న ఉద్యోగులు
స్థానిక ఆర్టీఏ కార్యాలయం యూనిట్ కేంద్రాల్లో ఉద్యోగులు ఏళ్ల తరబడి పాతుకుపోతున్నారు. నిబంధనల మేరకు బదిలీలు జరగడం లేదు. యూనిట్ కేంద్రాల్లో పనిచేసే సీనియర్, జూనియర్ అసిస్టెంట్లను ఏడాదికోసారి బదిలీ చేయాలనేది నిబంధన. అది ఇక్కడ తుంగలో తొక్కుతున్నారు. జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లిలో పనిచేస్తున్న సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు మూడేళ్లకుపైగా ఒకే చోట పాతుకుపోయినట్లు సమాచారం. వీరిలో సంఘ నాయకులు ఉండడంతోనే ఇలా జరుగుతున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండాలని కోరుకునే సంఘం నాయకులు దూరంగా ఉండే యూనిట్ కేంద్రాల్లో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కాసుల వర్షం కురిపిస్తూ పెద్ద ఎత్తున పైరవీలు చేసుకుంటూ జిల్లా కేంద్రంలోని డీటీసీ ఆఫీసుకు రాకుండా బదిలీలను ఆపుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. జిల్లా కేంద్రానికి సంబంధించిన డీటీసీ కార్యాలయంలో అధికారుల ఒత్తిడి, దరఖాస్తుదారుల తాకిడి తట్టుకోలేక యూనిట్ కేంద్రాలకే పరిమితమవుతున్నారని తెలుస్తోంది. బదిలీపై ఉన్నతాధికారులను అడగలేక పనిఒత్తిడిని తట్టుకోలేక తిమ్మాపూర్ ఆర్టీఏ కార్యాలయంలో ఉద్యోగులు సతమతమవుతున్నారు. కార్యాలయంలో అటెండర్లు సైతం ఇదే గోడును వెళ్లబోసుకుంటున్నారు.